Ysrcp Mla : వాగులో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు వైసీపీ ఎమ్మెల్యే సాహసం, వీడియో వైరల్
Ysrcp Mla : వాగులో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు సాహసం చేశారు. అల్లూరి జిల్లాలోని రాయిగడ్డ వాగును బైక్ పై దాటేందుకు ప్రయత్నించిన యువకుడు వరదలో చిక్కుకున్నాడు. ఎమ్మెల్యే ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో సాహసోపేతంగా యువకుడి వద్దకు వెళ్లి అతడ్ని రక్షించారు.
Ysrcp Mla : వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ వాగులు, గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటేందుకు ప్రయత్నిస్తూ కొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా అల్లూరి జిల్లా పాడేరు మండలం రాయిగడ్డ వద్ద వరదలో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు వైసీపీ ఎమ్మెల్యే సాహసం చేశారు. రాయిగడ్డ వాగు వరద ఉద్ధృతిని పరిశీలించేందుకు వెళ్లారు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు. అదే సమయంలో బైక్‌పై వాగును దాటేందుకు ప్రయత్నించిన యువకుడు మధ్యలో చిక్కుకున్నాడు. యువకుడి పరిస్థితిని చూసి వాగులోకి వెళ్లి అతడిని క్షేమంగా ఒడ్డుకు తీసుకున్నారు ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు. యువకుడిని కాపాడిన ఎమ్మెల్యేను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరో ఘటన
పాడేరు మండలం రాయిగడ్డ వద్ద ఆదివారం బైక్ మీద వాగు దాటేందుకు ప్రయత్నించిన యువకుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వాగు దాటుతుండగా వరద ప్రవాహం పెరగడంతో యువకుడు వంతెనపై బైక్ పట్టుకుని సుమారు గంటసేపు ఉండిపోయాడు. వరద పెరిగి బైక్ తో పాటు యువకుడు వాగులో పడిపోయాడు. వరద నీటిలో అతి కష్టంగా ఈదుకుంటూ ఒడ్డు వైపు చేరుకోగా, స్థానికులు అతడిని రక్షించారు. బైక్ పోతే పోయిందని, యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కొండ చరియలు విరిగి పడి ముగ్గురు గల్లంతు
అల్లూరి జిల్లా జీకేవీధి మండల పరిధిలోని చట్రపల్లె గిరిజన తండాలో సోమవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఏజెన్సీలో ఎడతెరిపిలేని వానలతో ఆదివాసీల ఇండ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ముగ్గురు గల్లంతు అవ్వగా.. నలుగురు గిరిజనులకు గాయాలు అయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గిరిజన గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.
డొంకరాయి జలశయానికి భారీగా వరద
అల్లూరి జిల్లాలోని డొంకరాయి జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుంది. దీంతో సోమవారం జలాశయం నుంచి 4 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం, పవర్ కెనాల్ నుంచి 4 వేలు క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డొంకరాయి జలాశయానికి ఇన్‌ఫ్లో లక్ష 10 వేలు క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
జనజీవనం అస్తవ్యస్తం
గత రెండు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా వై.రామవరం మండలంలో 74.2 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. పలు పొలాలు నీట మునిగాయి. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో ఘాట్ రోడ్లపైకి భారీ వాహనాలను అనుమతించడంలేదు. రాజవొమ్మంగి మండలంలో వర్షం కారణంగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు.
సంబంధిత కథనం