Paderu Bus Accident : పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం-100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి!-alluri district paderu apsrtc bus accident four died several injured ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Paderu Bus Accident : పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం-100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి!

Paderu Bus Accident : పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం-100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి!

Bandaru Satyaprasad HT Telugu
Aug 20, 2023 06:25 PM IST

Paderu Bus Accident : పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.

లోయలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
లోయలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Paderu Bus Accident : అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ వద్ద 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ఆర్టీసీ బస్సు పాడేరు నుంచి చోడవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

పాడేరు ఘాట్ లో రోడ్డులో బస్సు ప్రమాదం
పాడేరు ఘాట్ లో రోడ్డులో బస్సు ప్రమాదం

100 అడుగుల లోయలో పడిన బస్సు

అల్లూరి జిల్లాలోని పాడేరు ఘాట్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. విశాఖ నుంచి పాడేరు వెళ్తోన్న పాడేరు డిపోనుకు చెందిన ఆర్టీసీ బస్సు ఘాట్‌ రోడ్డు వ్యూ పాయింట్‌ వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఏడు పల్టీలు కొట్టిన బస్సు 100 అడుగుల లోయలోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. లోయలో పడిన బస్సు వద్దకు వెళ్లి ప్రయాణికులను కాపాడేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అతికష్టం మీద క్షతగాత్రులను రోడ్డుపైకి తీసుకువచ్చారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కూడా గాయపడ్డారు. పాడేరు నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సులో గాయపడిన వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల వర్షాలకు చెట్టు కొమ్మలు రోడ్డుపైకి వాలిపోవటం, ఘాట్ రోడ్డుకు రక్షణ గోడలేకపోవడం ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

'బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారందరికీ చికిత్స అందిస్తున్నాం. అవసరమైతే గాయపడ్డ వారిని మెరుగైన వైద్యచికిత్స కోసం విశాఖపట్నం తరలిస్తాం' అని అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ అన్నారు.

లోయలో పడిన బస్సు
లోయలో పడిన బస్సు

సీఎం జగన్ దిగ్భ్రాంతి

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యలు చేపట్టాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులను మంచి ఆసుపత్రుల్లో చేర్చి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు సూచించారు. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు.

గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలి- పురంధేశ్వరి

పాడేరులో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాడేరు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన బాధాకరమన్నారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, తీవ్రంగా గాయపడిన ప్రమాద బాధితులను విశాఖ తరలించాలని ఆమె కోరారు. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు ఉన్నారన్నారు. వైద్య అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బీజేపీ తరపున తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు.