AP Rains : శభాష్ సబ్ కలెక్టర్.. అధికారి అంటే భవానీ శంకర్‌లా ఉండాలి!
AP Rains : ఏపీలోని పలు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు జలమయం అయ్యాయి. నూజివీడు ఏరియాలో భారీ వర్షం కురవగా.. వరదలు పోటెత్తాయి. నూజివీడు సబ్ కలెక్టర్ భవానీ శంకర్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మందిని కాపాడారు.
భారీ వర్షాల కారణంగా.. నూజివీడు చుట్టుపక్కల ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. దీంతో నూజివీడు సబ్ కలెక్టర్ భవానీ శంకర్ రంగంలోకి దిగారు. ఎనిమిది గంటల రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. సబ్ కలెక్టర్ భవాని శంకర్ 82 మంది ప్రాణాలు కాపాడారు. తమ ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్ భవాని శంకర్‌కు వరద బాధితులు కృతజ్ఞతలు చెప్పారు. సోషల్ మీడియాలోనూ భవానీ శంకర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిండుకుండల్లా చెరువులు..
నూజివీడు చుట్టుపక్కల చాలా చెరువులు ఉన్నాయి. పట్టణాన్ని ఆనుకొని ఉన్న చెరువులు నిండు కుండలా మారాయి. నూజివీడు బైపాస్ రోడ్డు వరద నీటితో నిండిపోయింది. దీంతో మచిలీపట్నం- కల్లూరు రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముసునూరు మండలంలో రమణక్కపేట నుంచి వలసపల్లి వెళ్లే రోడ్డులో ఉన్న చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. ధర్మాజీగూడెం- వలసపల్లి మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
చంద్రబాబు సీరియస్..
కొందరు అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వంతో వ్యవహరించడం లేదంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కొందరు అధికారులు కావాలనే వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇకపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు అలెర్ట్‌గా ఉండాలని స్పష్టం చేశారు. వరదలు తగ్గి.. సాధారణ పరిస్థితికి వచ్చే వరకూ అధికారులు సీరియస్‌గా పనిచేయాలని ఆదేశించారు.
లోకేష్ సమీక్ష..
వరద సహాయ చర్యలపై ఉన్నత స్థాయి అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఎం స్పెషల్ సెక్రటరీ రవిచంద్ర, ఇంటిలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డాతో సహాయ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష చేశారు. వరద తగ్గుముఖం పడుతున్నందున.. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున.. అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.
వరద ప్రాంతాల్లో వైద్య సేవలు..
విజయవాడ ముంపు ప్రాంతాల్లో 14 మెడికల్ రిలీఫ్ కేంద్రాల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామని.. అధికారులు మంత్రి లోకేష్‌కు వివరించారు. హెలీకాప్టర్ ద్వారా 10 వేల మెడికల్ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ రాత్రికి వరద సాధారణ స్థితికి చేరుకోనుందని వివరించారు. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుత వరద ప్రవాహం 8,20,417 క్యూసెక్కులుగా ఉందని అధికారులు వివరించారు. ఈ రోజు వరద బాధితులకు 3 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.