Andhra Pradesh rains : 'నా కెరీర్లో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్'- సీఎం చంద్రబాబు
Andhra Pradesh rains live updates : ఆంధ్రప్రదేశ్ వరద ముప్పు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.. తన కెరీర్లో ఇదే అతిపెద్ద విపత్తు అని పేర్కొన్నారు. తాజా పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలిపారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు వర్షాలకు అల్లాడిపోతున్నారు. వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
1. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు ముఖ్యంగా విజయవాడలో సంభవించిన వరదలు తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద విపత్తు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
2. రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని చంద్రబాబు చెప్పారు.
3. "నా కెరీర్లో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్. హుద్ హుద్ తుపాను, తిత్లీ తుపాను వంటి సంఘటనలు జరిగాయి. అయితే వీటితో పోల్చితే ఇక్కడ మానవ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా ఉంది," అని చంద్రబాబు నాయుడు సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో అన్నారు. ఏపీలో వర్షాలకు ఇప్పటివరకు కనీసం 17మంది ప్రాణాలు కోల్పోయారు.
4. మరోవైపు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు 16 మంది మృతి చెందారు. రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.2 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
5. వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
6. విపత్తుకు సంబంధించిన అన్ని నివేదికలను కేంద్రానికి పంపుతామని, నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉదారంగా నిధులు ఇవ్వాలని కోరతామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి అత్యధికంగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గరిష్ఠంగా 11.9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా బ్యారేజీని రూపొందించినట్లు చంద్రబాబు తెలిపారు.
7. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సహాయక చర్యలు చేపట్టింది.
8. విజయవాడలో సహాయక చర్యలకు మద్దతుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సహాయక సామగ్రిని తీసుకెళ్లినట్లు అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది. హల్వారా, భటిండాకు చెందిన ఐఏఎఫ్ విమానాలు ఆంధ్రాలో ఎన్డీఆర్ఎఫ్ ప్రయత్నాలకు సహకరిస్తున్నాయి.
9. విజయవాడ, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు.
10. రెడ్ క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర ఎన్జీవోలు ప్రభుత్వ అధికారులతో కలిసి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని గవర్నర్ కోరారు. బాధితులకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీలో తమ భాగస్వామ్యం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.
11. దక్షిణ మధ్య రైల్వే నెట్‌వర్క్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, పట్టాలపై నీరు నిలిచిపోవడంతో 432 రైళ్లను రద్దు చేయగా, 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
12. సాయం కోసం ప్రజల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. మరోవైపు రెండు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
సంబంధిత కథనం