Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1300 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఇవిగో కారణాలు..-more than 1300 students sick due to food poisoning in nuzvid iiit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nuzvid Iiit: నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1300 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఇవిగో కారణాలు..

Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1300 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఇవిగో కారణాలు..

Basani Shiva Kumar HT Telugu
Aug 31, 2024 03:32 PM IST

Nuzvid IIIT: అన్నంలో పురుగులు.. నిళ్లలా సాంబారు.. అపరిశుభ్రమైన పరిసరాలు.. ఇదీ ప్రస్తుతం నూజివీడు ట్రిపుల్ ఐటీ పరిస్థితి. వీటి కారణంగా అక్కడ చదివే విద్యార్థులు 1300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమస్యలు చెప్పాలనుకున్న విద్యార్థులను సిబ్బంది బంధిస్తున్నారు.

విద్యార్థులకు వడ్డించిన అన్నంలో పురుగులు
విద్యార్థులకు వడ్డించిన అన్నంలో పురుగులు

నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్‌తో 1300 మంది విద్యార్థులకు పైగా అస్వస్థతకు గురయ్యారు. ట్రిపుల్ ఐటీ మెస్‌లో పురుగుల అన్నం పెట్టడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం రాత్రి వచ్చినప్పుడు.. తమ సమస్యలు చెప్పనివ్వలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సమస్యలు చెప్పడానికి ముందుకు వచ్చిన తమను హాస్టల్లో ఉంచి కళాశాల సిబ్బంది తాళం వేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

నీళ్ల సాంబారు..

నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉన్న వంట గదిలో.. పాత్రలు, గ్రైండర్లు కడగకుండానే వాడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. పులిసిపోయిన పిండి, పాడైన పెరుగు, చపాతీల్లో మైదా పిండి కలుపుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఇక సాంబారు అయితే.. నీళ్లలాగా ఉంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. పట్టించుకునే వారు లేరని విద్యార్థులు చెబుతున్నారు.

మా పిల్లలకు ఏమైంది..

ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీలో.. కేవలం ఏపీ విద్యార్థులే కాదు.. తెలంగాణ విద్యార్థులు కూడా చదువుతున్నారు. ట్రిపుల్ ఐటీలో ఒకేసారి ఇంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో.. స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏమైందోనని నూజివీడుకు పరుగులు తీస్తున్నారు. వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు వెళ్తున్నారు.

నిర్లక్ష్యం వద్దు..

'నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నన్ను ఆందోళనకు గురి చేసింది. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను అదేశించాను. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉంది' అని నారా లోకేష్ స్పష్టం చేశారు.