Nandigam Suresh Arrest : నా భర్తకు ఏదన్నా అయితే చంద్రబాబుదే బాధ్యత: బేబిలత-nandigam suresh wife baby latha expressed concern over his arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandigam Suresh Arrest : నా భర్తకు ఏదన్నా అయితే చంద్రబాబుదే బాధ్యత: బేబిలత

Nandigam Suresh Arrest : నా భర్తకు ఏదన్నా అయితే చంద్రబాబుదే బాధ్యత: బేబిలత

Nandigam Suresh Arrest : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సురేష్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఏపీకి తరలించారు. సురేష్ అరెస్టుపై ఆయన భార్య బేబిలత స్పందించారు. తన భర్తకు ఏదయినా జరిగితే.. చంద్రబాబుదే బాధ్యతని వ్యాఖ్యానించారు.

మీడియాతో మాట్లాడుతున్న నందిగం సురేష్ భార్య బేబిలత

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టుపై ఆయన భార్య బేబిలత ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ తన భర్తపై పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. సాక్ష్యాలు లేకుండా.. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన్ను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని బేబిలత ఆరోపించారు.

గతంలో ఇదే పీఎస్‌లో..

'గతంలో ఇదే పిఎస్‌లో నా భర్తపై హత్యాయత్నం చేశారు. రాత్రి 1 గంటకు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుండి తీసుకొచ్చే క్రమంలో నా భర్తను ఇబ్బంది పెట్టారు. సాక్ష్యాలు లేకుండా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు చేశారు. నా భర్తకు ఏదన్నా అయితే చంద్రబాబుదే బాధ్యత' అని సురేష్ భార్య బేబిలత వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో అరెస్టు..

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బుధవారం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఏపీ హైకోర్టు నిరాకరించడంతో.. బుధవారం సాయంత్రం నుంచి వేట మొదలైంది. నందిగం సురేష్‌ ఉద్దండరాయుని పాలెంలోని నివాసంలో అందుబాటులో లేకపోవడంతో.. ఆయన అచూకీ కోసం గాలించారు. హైదరాబాద్ మియాపూర్‌లో ఉన్నట్టు గుర్తించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు.. అక్కడి పోలీసుల సహకారంతో అరెస్ట్‌ చేశారు.

ముందస్తు బెయిల్ కోసం..

వైసీపీ నాయకులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లను ఏపీ హైకోర్టు బుధవారం రిజెక్ట్‌ చేసింది. చంద్రబాబు నివాసంపై దాడి విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో వైసీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి సహా ఇతర నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ రెండు ఘటనల్లో నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ పూర్తైన నేపథ్యంలో తాజాగా.. వారి పిటిషన్లను రిజెక్ట్‌ చేస్తున్నట్టు హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచనల ప్రకారం.. నిందితులపై రెండు వారాల పాటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని వైసీపీ నేతలు అభ్యర్థించారు.

అరెస్టుల భయం..

మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్‌ను కూడా అరెస్ట్ భయం వెంటాడుతోంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో.. ఆయన ఇంటిపై జరిగిన దాడి కేసులో జోగి రమేష్‌తో పాటు 13 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ వీఆర్‌కే కృపా సాగర్‌ బుధవారం తీర్పునిచ్చారు.