Ysrcp Bail Petitions: వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ఏపీ హైకోర్టు.. రెండు వారాల ఊరట కోరిన నేతలు
Ysrcp Bail Petitions: చంద్రబాబునివాసంపై దాడి ఘటనతో పాటు, టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనల్లో వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.
Ysrcp Bail Petitions: ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనల్లో వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. రెండు ఘటనల్లో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
వైసీపీ నాయకులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లను ఏపీ హైకోర్టు రిజెక్ట్ చేసింది. చంద్రబాబు నివాసంపై దాడి విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో వైసీపీ నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి సహా ఇతర నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ రెండు ఘటనల్లో నిందితులపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ పూర్తైన నేపథ్యంలో తాజాగా వారి పిటిషన్లను రిజెక్ట్ చేస్తున్నట్టు హైకోర్టు తీర్పునిచ్చింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచనల ప్రకారం నిందితులపై రెండు వారాల పాటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని వైసీపీ నేతలు అభ్యర్థించారు. రెండు వారాల పాటు గడువు ఇచ్చే అంశాన్ని మధ్యాహ్నం పరిశీలిస్తామని హైకోర్టు పిటిషనర్లకు తెలిపింది.