Agrigold Jogi Issue: జోగి రమేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, పథకం ప్రకారమే భూ కబ్జా.. రాజీవ్ కస్టడీ కోరిన ఏసీబీ
Agrigold Jogi Issue: అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జోగి తనయుడు, బాబాయ్‌ల పేర్లతో అగ్రిగోల్డ్‌కు చెందిన భూముల్ని కబ్జా చేయడం వెనుక పక్కా ప్రణాళిక ఉందని ఏసీబీ అనుమానిస్తోంది.మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్‌ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది.
Agrigold Jogi Issue: విజయవాడ రూరల్ మండలంలో కబ్జాకు గురైన అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అసలు దొంగలెవరో గుర్తించే పనిలో ఏసీబీ ఉంది. రెండేళ్లుగా పథకం ప్రకారం భూముల్ని కబ్జా చేసినట్టు ఏసీబీ గుర్తించింది. సర్వే నంబర్లను స్వీయ సవరణతో మార్చేసి సీఐడీ స్వాధీనంలో ఉన్న భూముల్లో ప్రహరీ నిర్మించిన తెంపరితనం చూసి దర్యాప్తు అధికారులు విస్తుబోతున్నారు.
రెవిన్యూ, సర్వే, రిజస్ట్రేషన్ శాఖల అధికారులతో కలిసి మాజీ మంత్రి జోగి రమేష్ ఈ దందాకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఇదంత ఒక ఎత్తైతే జోగి రమేష్‌కు తాను ఎలాంటి భూమిని విక్రయించలేదని నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడు. క్రయ విక్రయాల్లో పేర్కొన్న ఆధార్ కార్డు తనది కాదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి విక్రయించినట్టు పోలీసులకు వివరించాడు.
మరోవైపు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో అరెస్టైన జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఏసీబీ నమోదు చేసిన పీసీ యాక్ట్ చెల్లదని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ కేసులో ఏసీబీ తరపున హాజరైన స్పెషల్ పీపీ ఆనంద జ్యోతి ఆ వాదనల్ని తిరస్కరించారు.
మాజీ మంత్రిగా జోగి రమేష్ అధికారాన్ని అడ్డు పెట్టుకునే ఈ వ్యవహారం మొత్తం సాగిందన్నారు. ఈ కేసులో జోగి రాజీవ్‌ను ఏసీబీ విచారిచాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని కోరారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదు చేసిన సెక్షన్లు చెల్లుతాయని మాజీ మంత్రి తనయుడిగా సెక్షన్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో భూములు కొనుగోలు తాము నష్టపోయామని రాజీవ్ తరపు న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో భూముల కొనుగోలుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఏసీబీ పీపీ కోరారు.
జోగి రాజీవ్ భూమిని కొనుగోలు చేస్తే అందుకు సంబంధించి ఆదాయ ధృవీకరణ చూపించాలని, ఐటీ రిటర్నలలో వాటిని దాఖలు చేశారో లేదో స్పష్టం చేయాలని ఏసీబీ పీపీ ప్రశ్నించారు. దాదాపు రూ. కోటి అరవై లక్షల రుపాయల రిజిస్ట్రేషన్ వాల్యూకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పిటిషనర్లను కోరారు. దాదాపు రూ.10కోట్ల విలువ చేసే 2160 గజాల భూమిలో ఎననికల సమయంలో అపార్ట్‌మెంట్ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేశారు.
అసలు ఓనర్ లేకుండానే విక్రయం..
అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి నిర్వహించిన సర్వేలో తాను సంతకాలు చేయలేదని గ్రామ సర్వేయర్ దేదీప్య ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పాటు భూముల విక్రయానికి సంబంధించి జోగి రాజీవ్, జోగ వెంకటేశ్వరరావులకు తాను ఎలాంటి భూమి విక్రయించలేదని విక్రేత కూడా వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఈ మొత్తం బోగస్ వ్యవహారమని ఏసీబీ అనుమానిస్తోంది.
సీఐడీ జప్తులో ఉన్న భూమిని కాజేయడానికి పథకం ప్రకారం తప్పుడు పత్రాలను సృష్టించి ఉంటారని ఏసీబీ అనుమానిస్తోంది. దీంతో ఫోర్జరీ కేసులు కూడా నమోదు చేయనున్నారు. భూమి చేతులు మారినట్టు చూపడానికే వైసీపీ కార్పొరేటర్ కుటుంబానికి చెందిన ఏడుగురి పేరిట చిన్న ఫ్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ కేసులో వారిని కూడా విచారించనున్నారు. సర్వే నంబర్ 88లో పోలవరపు మురళీ మోహన్ నుంచి భూమిని కొనుగోలు చేసి దానిని 87వ నంబరులోకి మార్చేసుకుని ఆ వెంటనే ఇతరులకు విక్రయించేసి అతి తెలివి ప్రదర్శించారు.
మంత్రిగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ మొత్తం వ్యవహారాన్ని జోగి రమేశ్ నడిపించారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. సర్వే నంబర్ 88లో ఉన్న మొత్తం నాలుగు ఎకరాల భూమిలో 2301 గజాల భూమని బొమ్మా వెంకట చలమా రెడ్డి నుంచి 2001లో పోలవరపు మురళీ మోహన్ కొనుగోలు చేశారు. వాటిని అతను ఫ్లాట్లుగా గతంలోనే విక్రయించేశాడు. తాను జోగికి ఎలాంటి భూమిని విక్రయించలేదని తాజాగా ఏసీబీ అధికారులకు వివరించాడు.
2001లో కొనుగోలు చేసిన భూమిని 2010లోనే అమ్మేసినట్టు స్పష్టం చేశాడు. సర్వే నంబరు 88లో ఉన్న భూమిని కొనుగోలు చేసినట్టు చెబుతున్న జోగి కుటుంబం సర్వే నంబర్ 87లో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుంది. 2010లోనే తన భూమిని పోలవరపు మురళీ మోహన్ అమ్మేస్తే అదే వ్యక్తి నుంచి 2022లో తాను భూమిని కొనుగోలు చేసినట్టు పత్రాలను సృష్టించారు.
ఈ కేసులో పోలవరపు మురళీ మోహన్‌ను నిందితుడిగా చేర్చడంతో తాను అసలు ఎలాంటి భూమి విక్రయం చేయలేదని తేల్చాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఉన్న ఆధార్ చివరి నంబర్లు 6251గా ఉన్నాయి. తన ఆధార్ సంఖ్య 5420 అని ఏసీబీకి నిందితుడు పోలవరపు మురళీ మోహన్ వివరించాడు.దీంతో ఆ ఆధార్ సంఖ్యతో ఉన్న కర్రి రత్నం అనే వ్యక్తిని విచారించనున్నారు.
మరోవైపు రీ సర్వే సమయంలో తాను ఎలాంటి సర్వే చేయలేదని తన సంతకాలు ఫోర్జరీ చేశారని గ్రామ సర్వేయర్ వాంగ్మూలం ఇచ్చింది. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని జోగి రాజీవ్‌ను కస్టడీకి ఇస్తే అసలు రహస్యం బయట పడుతుందని ఏసీబీ భావిస్తోంది. విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో మధ్యాహ్నం భోజన విరామం తర్వాత బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.