Nara Lokesh : కర్ణాటకలో ప్రైవేట్ కోటా వివాదం, ఏపీలో ఐటీ సంస్థలు విస్తరించాలని నాస్కామ్ కు మంత్రి లోకేశ్ ఆహ్వానం
Nara Lokesh Invited Nasscom : కర్ణాటకలో పరిణామాలపై నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే నాస్కామ్ అసంతృప్తిని అర్థం చేస్తున్నామని, ఐటీ రంగానికి ఏపీ అనుకూలమని, ఇక్కడ సంస్థలు ఏర్పాటుకు అన్ని విధాలుగా సహాకరిస్తామని నాస్కామ్ ప్రతినిధులను ఏపీకి ఆహ్వానించారు మంత్రి లోకేశ్.
Nara Lokesh Invited Nasscom : ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చేలా కర్ణాటక ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొస్తుంది. ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ ఉద్యోగులు పూర్తిగా స్థానికులను నియమించాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై వివాదం చెలరేగింది. ఈ బిల్లు ప్రభావం ఐటీ, ఐటీయేతర సంస్థలపై పడుతుందని నాస్కామ్ ఆందోళన చెందుతుంది. ఈ మేరకు ఆ సంస్థ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే నాస్కామ్ ఆందోళనకు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ పరిష్కారం సూచించారు. ఏపీలో ఐటీ, ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు విశాఖ అనుకూలమని నాస్కామ్‌కు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం పలికారు. నాస్కామ్‌కు అన్ని విధాలుగా సహకరించేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. నాస్కామ్ అసంతృప్తి ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందని, ఏపీలో ఐటీ, ఐటీ సేవలు, ఏఐ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు అనుకూలమైన వాతావరణ ఉందని నాస్కామ్‌కు తెలిపారు. ఐటీ రంగం విస్తరణకు విశాఖలో అనుకూల వాతావరణం ఉందని ప్రతిపాదించారు. ఐటీ కంపెనీలు తమ సంస్థలను ఏపీకి బదిలీ చేసుకోవచ్చన్నారు. ఐటీ సంస్థలకు కావాల్సిన ఐటీ నిపుణులు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయన్నారు. పెట్టుబడులకు ఏపీలో అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
"ప్రియమైన నాస్కామ్ సభ్యులకు, మీ నిరాశను మేము అర్థం చేసుకున్నాము. వైజాగ్‌లోని మా IT, IT సేవలు, AI, డేటా సెంటర్ క్లస్టర్‌కి మీ వ్యాపారాలను విస్తరించడానికి లేదా మార్చడానికి మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. మేము మీకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిమితులు లేకుండా అత్యంత అనుకూలమైన నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను అందిస్తాం. మీకు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది" -నారా లోకేశ్ ట్వీట్
కర్ణాటక ప్రైవేట్ కోటా వివాదమేంటి?
ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్‌కు సమాచారం అందించారు. పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర వ్యాపార సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తూ 'కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు 2024' గురువారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.
ఏదైనా పరిశ్రమ, ఫ్యాక్టరీ లేదా ఇతర సంస్థ నిర్వహణ విభాగాల్లో స్థానిక అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. నాన్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో 75 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సి, డి గ్రేడ్ ఉద్యోగులు పూర్తిగా స్థానికులను నియమించాలి. అంటే వంద శాతం రిజర్వేషన్ అన్నమాట. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో జన్మించిన వారు, కర్ణాటకలో 15 ఏళ్లుగా నివసిస్తున్నవారు, కన్నడ భాష మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసిన వారు రిజర్వేషన్లకు అర్హులు. అభ్యర్థులకు కన్నడ భాషగా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ లేకపోతే, వారు నోడల్ ఏజెన్సీ ద్వారా నిర్దేశించిన కన్నడ ప్రావీణ్యత పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. దీనిపై స్థానిక సంస్థలు, ఐటీ కంపెనీల నుంచి విమర్శలు వస్తున్నాయి. నాస్కామ్ సైతం ఈ బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
సంబంధిత కథనం