Ex-Agniveer: మాజీ అగ్నివీర్ లకు సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఆర్పీఎఫ్ ల్లో 10 శాతం రిజర్వేషన్లు-exagniveers to get 10 percent reservation age relaxations in cisf bsf rpf ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ex-agniveer: మాజీ అగ్నివీర్ లకు సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఆర్పీఎఫ్ ల్లో 10 శాతం రిజర్వేషన్లు

Ex-Agniveer: మాజీ అగ్నివీర్ లకు సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఆర్పీఎఫ్ ల్లో 10 శాతం రిజర్వేషన్లు

HT Telugu Desk HT Telugu
Jul 11, 2024 08:21 PM IST

Ex-Agniveer: త్రివిధ దళాల్లో అగ్నివీర్ లుగా సేవలు అందించి పదవీ విరమణ చేసిన వారికి సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఆర్పీఎఫ్ సహా కేంద్ర బలగాల రిక్రూట్మెంట్ లో 10% రిజర్వేషన్లు కల్పిస్తారు. దాంతో పాటు వారికి నిబంధనల మేరకు వయో పరిమితి లోనూ సడలింపు ఉంటుంది. ఈ విషయాన్ని ఆయా దళాల చీఫ్స్ గురువారం నిర్ధారించారు.

Agniveer  (REPRESENTATIVE PIC)
Agniveer (REPRESENTATIVE PIC)

Ex-Agniveer: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తో సహా కేంద్ర బలగాలు తమ తమ బలగాల్లో 10 శాతం పోస్టులను మాజీ అగ్నివీరులకు రిజర్వ్ చేయనున్నాయి.

2022 జూన్ నుంచి..

2022 జూన్ లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. అగ్నివీర్ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి రెగ్యులర్ రిక్రూట్ మెంట్లను నిలిపివేశారు. ఈ పథకంలో భాగంగా 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువతను నాలుగేళ్ల పాటు రిక్రూట్ చేసుకుంటారు. వారిలో, అన్ని అర్హతలు ఉన్న 25 శాతం మందిని మరో 15 ఏళ్లు కొనసాగిస్తారు. అయితే, నాలుగేళ్లు అగ్నివీర్ లుగా కొనసాగి, రిటైర్ అయిన 75 శాతం మంది పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

సీఐఎస్ ఎఫ్ లో 10 శాతం రిజర్వేషన్లు

హోంశాఖ నిర్ణయానికి అనుగుణంగా సీఐఎస్ ఎఫ్ కూడా ఈ నియామక ప్రక్రియకు సిద్ధమవుతోందని సీఐఎస్ఎఫ్ (CISF) డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ తెలిపారు. భవిష్యత్తులో జరిగే కానిస్టేబుల్ నియామకాల్లో 10 శాతం ఉద్యోగాలను మాజీ అగ్నివీర్ లకు కేటాయిస్తామని సీఐఎస్ఎఫ్ చీఫ్ ప్రకటించారు. మాజీ అగ్నివీర్ లకు శారీరక పరీక్షలు, వయోపరిమితి సడలింపుల్లో మినహాయింపులు లభిస్తాయి. మొదటి ఏడాది ఐదేళ్లు, తర్వాతి ఏడాది మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీర్ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళం శిక్షణ పొందిన, క్రమశిక్షణ కలిగిన సిబ్బందిని పొందే అవకాశం లభిస్తుంది కనుక ఇది సీఐఎస్ఎఫ్ కు కూడా ప్రయోజనకరమని సింగ్ చెప్పారు.

బీఎస్ఎఫ్ లో కూడా..

10 శాతం అగ్నివీరులకు కేటాయిస్తామని బీఎస్ఎఫ్ (BSF) డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ తెలిపారు. మొదటి బ్యాచ్ కు ఐదేళ్లు, తర్వాతి బ్యాచ్ లకు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుందని తెలిపారు. నాలుగేళ్ల అనుభవం, పూర్తి క్రమశిక్షణ, శిక్షణ ఉన్న మాజీ అగ్నివీర్లను రిక్రూట్ చేసుకోవడం ద్వారా దళానికి ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. స్వల్ప శిక్షణ అనంతరం సరిహద్దు వెంబడి మోహరించే శిక్షణ పొందిన సైనికులను తాము స్వీకరిస్తామని అగర్వాల్ తెలిపారు.

ఆర్పీఎఫ్ లో కూడా..

రైల్వే రిక్రూట్మెంట్ ఫోర్స్ (RPF) లో భవిష్యత్తులో జరిగే అన్ని కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లలో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ ఉంటుందని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ ప్రకటించారు. మాజీ అగ్నివీర్ లకు స్వాగతం పలకడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వారి చేరిక దళానికి కొత్త బలాన్ని, శక్తిని, మనోధైర్యాన్ని ఇస్తుందన్నారు.

Whats_app_banner