AP IAS transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, జగన్‌ జట్టు అధికారులపై వేటు.. జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశం-massive transfers of ias officers in ap attack on jagans team ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ias Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, జగన్‌ జట్టు అధికారులపై వేటు.. జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశం

AP IAS transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, జగన్‌ జట్టు అధికారులపై వేటు.. జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశం

Sarath chandra.B HT Telugu
Jun 22, 2024 11:36 PM IST

AP IAS transfers: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరడంతో జిల్లాల ప్రక్షాళన మొదలైంది. జగన్ ప్రభుత్వంలో కీలక జిల్లాల్లో స్థానాలు పొందిన అధికారులకు స్థాన చలనం కలిగింది.

ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు
ఏపీలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

AP IAS transfers: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక జిల్లాల్లో పోస్టింగులు దక్కించుకున్న అధికారులకు స్థాన చలనం కలిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు జిల్లా కలెక్టర్లను జిఏడిలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీని బదిలీ చేశారు.

ప్రస్తుతం గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డిని జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించిన వేణుగోపాల్‌ రెడ్డికి సిఎం అపాయింట్‌ మెంట్ దక్కలేదు.

విశాఖ కలెక్టర్ మల్లికార్జునను కూడా బదిలీ చేశారు. మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు. విశాఖలో భూకేటాయింపులు,వివాదాస్పద నిర్ణయాల్లో మల్లికార్జున కీలకంగా వ్యవహరించారిన కొత్త ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ కలెక్టర్‌గా ప్రస్తుతం విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.

అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీతను బదిలీ చేశారు. ఆమె స్థానంలో అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్‌ను నియమించారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగిలి షణ్మోహన్‌ను నియమించారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి నియామించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతిని నియమించారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన అధికారుల్లో ప్రశాంతి ఒకరు.

ప్రస్తుతం అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖలో విధులు నిర్వహిస్తోన్న ప్రశాంతి ఎన్నికల సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గపోవడంతో ఆమెను బదిలీ చేశారని ప్రచారం జరిగింది. ఇటీవల డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశాంతితో పాటు ఆమె భర్త ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు భేటీ అయ్యారు.

విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్‌ను నియమించారు. గతంలో ఆయన విపత్తుల నిర్వహణ శాఖలో పనిచేశారు.గతంలో ఏపీ హైకోర్టులో పనిచేసిన న్యాయమూర్తి సోదరుడు కావడంతో ఆయనకు కీలక పోస్టింగులు దక్కలేదని ప్రచారం జరిగింది.

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణిని నియమించారు. మాజీ ఐపీఎస్‌ అధికారి సతీమణి అయిన నాగరాణిని గత ప్రభుత్వంలో పక్కన పెట్టారనే ప్రచారం ఉంది. చిత్తూరుజిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌ను నియమించారు.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా గుమ్మళ్ల సృజనను నియమించారు. సృజన గతంలో కర్నూలు కలెక్టర్‌గా పనిచేశారు. ఆమె తండ్రి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో ఐఏఎస్‌ అధికారిగా పనిచేశారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియాను నియమించారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషాను నియమించారు. ఆయన గతంలో నారా లోకేష్ ఓఎస్డీగా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయనను పక్కన పెట్టారు. బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన అధికారుల్లో గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత, కాకినాడ జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మాధవిలత వైసీపీ అనుకూల అధికారిగా ముద్రపడ్డారు. ఉమ్మడి కృష్ణా జాయింట్‌ కలెక్టర్‌గా సుదీర్ఘ కాలం పనిచేశారు. జగన్ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతంగా పనిచేసిన అధికారుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

వైసీపీ అనుకూల అధికారులుగా ముద్రపడిన అధికారులను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. గతంలో కీలక స్థానాల్లో కొనసాగిన అధికారుల్లో కర్నూలు జిల్లా కలెక్టర్‌ గుమ్మళ్ల సృజన ఒక్కరికే తాజా పోస్టింగుల్లో ప్రాధాన్యత దక్కింది. సృజన భర్త ఏపీ హైకోర్టులో, సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ఉన్నారు. సమతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వివి.కృష్ణారావు మనుమడు పదిరి రవితేజను సృజన పెళ్లాడారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటం చేసిన వారిలో రవితేజ కూడా ఉన్నారు. గత ఏడాది ఆయన ఫేస్‌బుక్‌ పోస్టింగులతో కలెక్టర్ సృజన ప్రభుత్వ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. 

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పాలనపై తమ ముద్ర వేసే ప్రయత్నిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాతవాసనలు పోగొట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Whats_app_banner