Nadendla Manohar : ఏపీలో వైసీపీ దుకాణం బంద్, అందుకే భూముల క్లియరెన్స్ సేల్- నాదెండ్ల మనోహర్-mangalagiri news in telugu janasena nadendla manohar alleged ysrcp govt clearance sale for lands ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nadendla Manohar : ఏపీలో వైసీపీ దుకాణం బంద్, అందుకే భూముల క్లియరెన్స్ సేల్- నాదెండ్ల మనోహర్

Nadendla Manohar : ఏపీలో వైసీపీ దుకాణం బంద్, అందుకే భూముల క్లియరెన్స్ సేల్- నాదెండ్ల మనోహర్

Bandaru Satyaprasad HT Telugu
Dec 13, 2023 04:05 PM IST

Nadendla Manohar : ఏపీలో వైసీపీ దుకాణం బంద్ చేసేందుకు సిద్ధమైందని, అందుకే క్లియరెన్స్ సేల్ తరహాలో భూ కేటాయింపులు చేస్తుందని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పరిశ్రమల కోసమంటూ చేపట్టిన భూకేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

నాదెండ్ల మనోహర్
నాదెండ్ల మనోహర్

Nadendla Manohar : వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. పరిశ్రమల కోసమంటూ భూ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. మంగళగిరిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులు ప్రోత్సహించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం... క్విడ్ ప్రోకో డీల్స్ తో కొన్ని కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకున్న రూ. 13 లక్షల కోట్లు ఎంఓయూలు ఏమైయ్యాయని ప్రశ్నించారు. దుకాణం బంద్ చేసే ముందు క్లియరెన్స్ సేల్ పెట్టి మార్కెటింగ్ చేసినట్లు... తమకు అనుకూలంగా ఉన్నవారికి నిబంధనలతో పనిలేకుండా వైసీపీ ప్రభుత్వం భూములు కట్టబెట్టిందన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు స్థిరమైన పాలసీ లేకపోవడంతో నాలుగున్నరేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. కనీసం రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని అన్నారు.

పారిశ్రామిక రంగంలో స్థిరమైన పాలసీ లేదు

"వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి ఎస్ఈజెడ్ విధానాన్ని తీసుకొచ్చారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వేధించడం మొదలుపెట్టారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేశారు. వీళ్ల బెదిరింపులు తట్టుకోలేక చాలా మంది పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయారు. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వానికి ఒక స్థిరమైన పాలసీ లేకపోవడంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి క్షీణించింది."- నాదెండ్ల మనోహర్

నోటీసులు ఇచ్చిన సంస్థకే మళ్లీ కేటాయింపులు

కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం 2,680 ఎకరాలు కేటాయిస్తూ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొన్ని కారణాలతో ఆ సంస్థ ప్రాజెక్టును సకాలంలో నిర్మించలేకపోయిందని, కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో... ప్రాజెక్టు నిర్మించలేమని తాము బ్యాంకు గ్యారెంటీగా పెట్టిన రూ. 300 కోట్లు తిరిగి ఇచ్చేయాలని 2016 జనవరిలో ప్రభుత్వానికి ఉత్తరం రాసిందన్నారు.

అయితే భూములు వెనక్కి తీసుకోకుండా అదే సంస్థలో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ కు ఈ భూములు కట్టపెట్టారని ఆరోపించారు. దీన్ని మొదట మెగా ప్రాజెక్టు అన్నారని, ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్, బేస్డ్ పవర్ జనరేషన్ అంటున్నారన్నారు. క్లియరెన్స్ సేల్ లో బిజీగా ఉన్న సీఎం జగన్ తాను ఛైర్మన్ గా ఉన్న స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు ద్వారా చీఫ్ సెక్రటరీ కమిటీ అభ్యంతరాలను పక్కన పెట్టారని ఆరోపించారు. నవంబర్ 3న కేబినెట్ భేటీలో భూములు రిలయన్స్ కు ఇస్తున్నట్లు ఆమోదం తెలిపిందన్నారు. ఏ భూమిని లాగేసుకుంటాం అని చెప్పారో అదే భూమిని కొత్త రాయితీలతో వాళ్లకే కట్టబెట్టారని మండిపడ్డారు.

భూములు వెనక్కి తీసుకుంటామని చెప్పి మళ్లీ వాళ్లకే

"అనంతపురం జిల్లా హిందూపురంలో అపారల్ పార్క్ ఏర్పాటు చేయడానికి నియోజన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు వైఎస్సార్ ప్రభుత్వం 350 ఎకరాలు కేటాయించింది. 2019లో జగన్ సీఎం అయిన తరువాత భూములు వెనక్కి ఇచ్చేయాలని వెంటపడటంతో వాళ్లు కోర్టుకు వెళ్లారు. ఎస్ఈజెడ్ కింద భూమి ఇస్తే ఈ రోజు దాని వాస్తవ కేటాయింపు తీరు మారుస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అపారల్ పార్క్ కాకుండా ఏరో స్పేస్, ఆటో మొబైల్స్, జనరల్ ఇంజినీరింగ్ కోసమంటూ నియోజన్ వాళ్లు తాజాగా దరఖాస్తు పెట్టుకుంటే స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించింది.

అపారల్ పార్క్ అయితే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుందని, మహిళ సాధికారితకు ఉపయోగపడుతుందని చెప్పి స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించింది. ఈ బోర్డు తిరస్కారాన్ని కాదంటూ నవంబర్ 3న కేబినెట్ లో నియోజన్ దరఖాస్తుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎవరికి లబ్ధి చేకూర్చడానికి పాలసీలను మారుస్తున్నారు? భూములు వెనక్కి తీసుకుంటామని చెప్పి ఇప్పుడు వాళ్లకే రాయితీలతో, వాళ్ళు కోరిన విధంగా ఇవ్వడం వెనుక కారణం ఏంటి? స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు తిరస్కరించినా మీరెందుకు ఆమోదించారో ప్రజలకు సమాధానం చెప్పాలి" - నాదెండ్ల మనోహర్

Whats_app_banner