Palnadu : పల్నాడు జిల్లాలో బ్యాంక్ మేనేజర్ బాగోతం.. ఐసీఐసీఐ బ్యాంక్‌లో నిధుల గోల్‌మాల్
Palnadu : పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకుల్లో మేనేజరే అవకతవకలకు పాల్పడ్డాడు. కోట్లాది రూపాయలు మోసం చేశాడు. అధిక వడ్డీల పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించి.. సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. ఈ కేసును సీఐడీకి అప్పగించారు.
కంచే చేను మేసినట్లు.. బ్యాంకు మేనేజరే మోసం చేశాడు. ఇది పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకుల్లో జరిగింది. ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట శాఖ మేనేజర్‌గా 2017 ఏప్రిల్‌లో డి.నరేష్ చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టాడు. ఖాతాదారుల ఇళ్లకు వెళ్లి వారితో సంబంధాలు పెంచుకున్నాడు.
బ్యాంకు మేనేజర్, ఖాతాదారుల మధ్య మంచి సంబంధాలు, నమ్మకం ఉండేది. బ్యాంకు మేనేజర్‌ను బాగా నమ్మారు. అధిక వడ్డీ వస్తుందని ఖాతాదారులను నమ్మించి, చాలా మందితో బ్యాంకులో నగదును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించాడు. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినందుకు ఖాతాదారులకు బాండ్లు ఇచ్చాడు. ఖాతాదారుల ఫోన్లు ఉపయోగించి.. బాండ్లపై ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) పేరుతో నగదు మొత్తం తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నాడు.
కొందరిని ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్మును రెన్యువల్ చేస్తున్నానని చెప్పి, వారి వద్ద నుంచి ఓటీపీ చెప్పించుకుని నగదును తన ఓడీలోకి మళ్లించుకున్నాడు. 2021లో నరసరావుపేట శాఖకు బదిలీ అయ్యాడు. అక్కడా కూడా ఇలానే ఖాతాదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించి, ఆ నగదును తన ఓడీ ఖాతాలోకి మళ్లించుకున్నాడు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినప్పుడు నెలనెలా వడ్డీ, బ్యాంక్ నుంచి ఖాతాదారుల ఖాతాలో జమ కావాల్సి ఉంది. కానీ.. ఇక్కడ బ్యాంకు నుంచి కాకుండా వేరే ఖాతా నుండి వడ్డీ జమ అయ్యేది. అయితే.. నెలనెలా వడ్డీ వస్తుండటం, అందులోనూ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది మేనేజర్ కావడంతో.. ఖాతాదారులకు అనుమానం రాలేదు. బ్యాంకు మేనేజర్ నరేష్ గతేడాది నరసరావుపేట నుంచి విజయవాడకు బదిలీ అయ్యాడు. అక్కడ కూడా ఇదే మోసానికి పాల్పడ్డాడు.
వాస్తవానికి బ్యాంకులు వయోవృద్ధులకు 8 శాతం మించి వడ్డీ ఇవ్వవు. కానీ నరేష్ అంతకంటే ఎక్కవ వడ్డీ అని చెప్పి ఖాతాదారులను మోసం చేశాడు. ఖాతాదారులకు వడ్డీ పేరుతో నెలనెలా నూటికి రూ.1.10 చొప్పున వేసేవాడు. నూటికి రూపాయికి పైగా వడ్డీ అని చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేలా మాయ చేశాడు. బ్యాంక్ మేనేజర్ నరేష్‌కు గోల్డ్ అప్రైజర్ హరీష్ సహకరించాడు. ఖాతాదారులు లాకర్‌లో దాచుకున్న బంగారం కూడా మాయం చేశారు.
పరారీలో నిందితుడు..
చిలకలూరిపేటలో సుమారు 90 మంది ఖాతాదారులు ఒక్కొక్కరు రూ.10 లక్షల నుంచి రూ.1.8 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి మోసపోయారు. నరసరావుపేటలోనూ సుమారు 10 మంది ఖాతాదారులు ఇలానే మోస పోయారు. ఈ మోసం విలువ దాదాపు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిందితుడు నరేష్ పరారీలో ఉన్నాడు. గోల్డ్ అప్రైజర్ హరీష్ ఆత్మహత్యాయత్నానికి యత్నించి.. గుంటూరులో చికిత్స పొందుతున్నాడు.
లుకౌట్ నోటీసులు..
నెలనెలా అధిక వడ్డీ వస్తుందని భావించిన ఖాతాదారులకు, గత రెండు నెలలుగా వడ్డీ తమ ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఆయా బ్యాంకులకు ఖాతాదారులు వెళ్లి సిబ్బందిని అడిగారు. ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్ల బాండ్లు చెల్లవని, అందులో నగదు, బంగారం లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఖాతాదారులు అవాక్కయ్యారు. మోసపోయామని గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు ఈ కేసును సీఐడీకి అప్పగించారు. మేనేజర్ నరేష్ విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఇవాళ్టి నుంచి సీఐడీ విచారణ ప్రారంభం కానుంది. బాధితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)