Fake Bank Officers : బ్యాంకు అధికారుల్లా చెలామణి, తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని రైతులకు టోకరా
Fake Bank Officers : బ్యాంకు అధికారులుగా చెలామణి అవుతూ.. రైతులు, వ్యాపారస్తులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడిన ఏడుగురిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. లోన్లు ఇప్పిస్తామని రైతులు, వ్యాపారస్తుల నుంచి రూ.26 లక్షలు వసూలు చేశారు.
బ్యాంకు అధికారులుగా చెలామణి అవుతూ, రైతులను, వ్యాపారస్తులను మభ్యపెడుతూ.. తక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇప్పిస్తామని మోసాలకు తెగబడిన వారి చేతులకు బేడీలు పడ్డాయి. ఈ నిందితులను నల్లగొండ జిల్లా పోలీసు అరెస్ట్ చేశారు. జిల్లాలో గత కొంత కాలంగా బ్యాంకు అధికారులుగా చెలామణి అవుతూ.. రైతుల భూములను తనఖాగా పెట్టుకొని తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంకు నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. వివిధ బ్యాంకులలో పనిచేస్తున్న అధికారులుగా నటిస్తూ నల్గొండ జిల్లాలోని పెద్దవూర, తిరుమలగిరి (సాగర్) నిడమానూరు, నేరేడుగొమ్ము, దేవరకొండ , పీఏపల్లి మండలాలలోని అమాయక రైతుల నుంచి రుణాలు ఇప్పించే పేర ముందస్తుగా రైతుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు.
హాలియా మండలంలోని ఒక వ్యాపారికి సోషల్ వెల్ఫేర్ శాఖలో ఆధిక మొత్తంలో లోన్లు ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఈ ముఠాను అరెస్ట్ చేసిన పెద్దవూర పోలీసులు వారి నుంచి లక్షా అరవై అయిదు వేల రూపాయలు, రైతుల నుంచి వారు తీసుకున్న పట్టాదారు పాసుపుస్తకాలు అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా పోలీసులు పైన తెలిపిన మండలాలలో నిందితులు రైతులు, వ్యాపారస్తుల నుంచి వసూలు చేసిన రూ.25 లక్షలు రికవరీ చేశారు. మొత్తం 7 మండలాలకు చెందిన 28 మంది రైతులను మోసం చేసి దాదాపు 26 లక్షల రూపాయలు వసూలు చేసిన ఏడుగురు నిందితులు అరెస్టు చేశారు.
కట్టేబోయిన పరమేష్, మమ్ముల జ్యోతి స్వరూప్ అలియాస్ మణి అలియాస్ రాజేష్, షేక్ వజీర్, కొండా శ్రీను అలియాస్ శ్రీనివాస్ పోగుల సురేశ్ అలియాస్ రమేశ్, చిలుముల సైదులు, పల్లెబోయిన నాగరాజు అలియాస్ నాగార్జున , ముప్పిడి సైదులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.
( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్)