Musi Row : మూసీ నది ప్రక్షాళన.. ఒక్కటవుతున్న ఉమ్మడి నల్గొండ రైతులు
Musi Row : మూసీ నది ప్రక్షాళనకు ఉమ్మడి నల్గొండ రైతులు ఒక్కటవుతున్నారు. హైదరాబాద్ నాగోల్‌లో శనివారం రైతులు సమావేశం కానున్నారు. ప్రభుత్వానికి అండగా నిలబడేందుకు రైతులు సై అంటున్నారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొడతామని ఇటు కాంగ్రెస్ నాయకత్వం అంటోంది.
మూసీ ప్రక్షాళన అంశం ఇప్పటికే రాజకీయ మంటలు రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లకు వేదికగా నిలుస్తోంది. మూసీ రివర్ బెడ్ లోని ఆక్రమణలను తొలగించడం, మూసీ మురుగు నీటి శుద్ధీకరణ, సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50లక్షల కోట్ల ప్రాజెక్టుకు డిజైన్ చేసింది. మూసీ నదిపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఉన్నారు.
మూసీ ప్రక్షాళన విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని.. జిల్లా రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం శనివారం హైదరాబాద్ నాగోల్ లోని శుభం గార్డెన్స్‌లో సాయంత్రం నాలుగు గంటలకు మూసీ పరివాహక ప్రాంత రైతులు సమావేశం కానున్నారు. ‘ఈ సమావేశానికి రైతులు స్వచ్ఛందంగా హాజరు కావాలి’ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఏం జరుగుతోంది..?
కాలుష్య కూపంగా మారిన మూసీ నదిని ప్రక్షాళనకు జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకింత ప్రయత్నించినా అది నివేదికలు, అంచనాల దశ దాటలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజల జనజీవనంతో పెనవేసుకున్న మూసీ నది నీరు.. ఇపుడు విషతుల్యంగా మారింది. ఏళ్లుగా మూసీ నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్య తక్కువేం కాదు.
నకిరేకల్ నియోజకవర్గం సోలిపేట గ్రామం వద్ద మూసీ నదిపై మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టును 1960ల్లోనే నిర్మించారు. గతంలో ఈ నది నీరు సాగు, తాగు, పాడి, మత్స్య రంగాలకు ఉపయోగపడేది. హైదరాబాద్ దాటి వచ్చాక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూసీపై 24 కత్వాలు నిర్మించారు. వీటి ద్వారా సాగు నీరు అందేది. ఇదే మూసీ నీటిపై ఆధారపడిన ఆసిఫ్ నహర్ వంటి చిన్న తరహా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వలూ ఉన్నాయి. కానీ.. కాలుష్య నీటితో పండించిన పంటలను మార్కెట్‌లో అమ్ముకో లేని దుస్థితి నెలకొంది.
అంతర్జాతీయ నగరంగా పేరున్న హైదరాబాద్‌లో మూసీ దుర్గంధాన్ని వెదజల్లుతోంది. మానవ వ్యర్దాలు, ఔషధ, రసాయన పరిశ్రమల వ్యర్థాలతో విషతుల్యంగా మారిన మూసీ నీరు ప్రజలకు అనారోగ్యాలను పంచుతోంది. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం మూసీ శుద్ధీకరణ, సుందరీకరణకు నడుం కట్టడంతో మూసీ పరీవాహక ప్రాంతాల వాసుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మూసీ ఆక్రమణల తొలగింపు వివాదాస్పదం కావడం, ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ నిర్వాసితుల పక్షాన ఆందోళనలకు దిగుతుండడంతో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు జిల్లా రైతాంగం సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.
కుట్రలను తిప్పి కొట్టేందుకు..
ప్రభుత్వం ఎస్టీపీలతో మురికి నీటిని శుద్ధి చేసి, గోదావరి జలాలతో నింపి, రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోందని అధికార కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మూసీ నదిని శుద్ధి చేసి పరివాహక ప్రాంత ప్రజలను కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళుతుంటే, ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్ష నాయకులు రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టించి మూసి ప్రక్షాళన అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టేందుకు రైతాంగాన్ని సమీకరిస్తున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే అధ్వానంగా తయారైన మూసీ నదిని.. ఇకనైనా శుద్దీకరించి కాపాడుకోకుంటే మూసీ పరీవాహక ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నాగోల్‌లో జరిగే రైతుల సమావేశంలో పలు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
(రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్)