Uttarandhra Floods : వాగులో కొట్టుకుపోయిన వాహనం.. డ్రైవరును కాపాడిన స్థానికులు.. పొంగిపొర్లుతున్న వాగులు
Uttarandhra Floods : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాగులో కొట్టుకుపోయిన ఓ వాహనం డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం- బుడతవలస గ్రామాల మధ్య వాహనం వాగులో కొట్టుకుపోయింది. వాహన డ్రైవరును స్థానికులు కాపాడారు. వాగులో కొట్టుకుపోయి వాహనం.. కొంత దూరంలో ఒడ్డు వద్ద ఆగింది. అయితే.. వాగు ముందు ట్రాక్టర్ వెళ్లడంతో.. వాహనాలు వెళ్తున్నాయనే ముందుకు వచ్చానని డ్రైవర్ వివరించారు. వరదలు వస్తున్నా కారణంగా.. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
రెయిన్ అలర్ట్..
ఏపీలో మూడు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ అయ్యింది. ఆదివారం సాయంత్రం, రాత్రి భారీ వర్ష సూచన ఉందని అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా వర్ష సూచన ఉందని స్పష్టం చేశారు. 4 జిల్లాలకు వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
లంక గ్రామాలకు ముప్పు..
ఏలూరు జిల్లా కొల్లేరు లంక గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. బుడమేరు వాగు ఉధృతితో కొల్లేరుకు భారీగా వరద వస్తోంది. దీంతో కొల్లేరు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు బుడమేరు వరదలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అవసరమైన చర్యలను అధికారులు వెంటనే చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
వరద నష్టంపై కీలక ప్రకటన..
వరద నష్టంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏపీలో వరదలతో 45 మంది మృతి చెందారని వెల్లడించింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 35 మంది మృతి చెందగా.. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు, ఏలూరు జిల్లాలో ఒకరు మృతి చెందారని ప్రభుత్వం వెల్లడించింది. 1,81,53,870 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపింది. 19, 686 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిళ్లిందని.. 3,913 కి.మీ మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయని వివరించింది. 558 కిలో మీటర్ల అర్బన్ రోడ్లు ధ్వంసం అవ్వగా.. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని వెల్లడించింది.