Khammam Floods : ఖమ్మం - వైరా హైవే మీద వరద బాధితుల ధర్నా.. కారణం ఏంటో తెలుసా?
Khammam Floods : ఖమ్మం ప్రజలను వర్షాలు, వరదలు వెంటాడుతున్నాయి. అయితే.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి నీరు వస్తున్నా.. అధికారులు ఇటువైపు రావడం లేదని ఖమ్మం - వైరా హైవేపై ఆందోళన చేశారు. అటు కేంద్రమంత్రిని అడ్డుకున్నారు.
ఖమ్మం వరద బాధితుల రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇంట్లోకి నీళ్లు వస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఖమ్మం - వైరా హైవే మీద ధర్నాకు దిగారు. ఇంకా భారీ వర్షాలు వస్తున్నాయనే హెచ్చరికలు ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కిషన్ రెడ్డికి నిరసన సెగ..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఖమ్మం జిల్లా దంసలాపురంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వరద బాధితులు అడ్డుకున్నారు. తమకు ఎటువంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెళ్లారు. ఈ సమయంలో మహిళలు వాహనాలను ఆపారు.
ముంపు ప్రాంతాల్లో అధికారుల అలెర్ట్..
అటు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ముంపు ప్రాంతాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు సురక్షిత ప్రాంతంలో ఉండాలని అధికారులు సూచించారు.
ఐఎండీ హెచ్చరిక..
గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా మరోసారి తెలంగాణకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
సెప్టెంబర్ 11 వరకూ..
సోమవారం నాడు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో సెప్టెంబర్ 11వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.