YSR EBC Nestham : ఈ నెల 24న మహిళల ఖాతాల్లోకి డబ్బులు, ఈబీసీ నేస్తం నిధులు విడుదల!
YSR EBC Nestham : వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం స్కీమ్ ద్వారా అగ్రవర్ణాల మహిళలకు రూ.15 వేల జమ చేయనుంది ప్రభుత్వం. ఈ నెల 24న కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు.
YSR EBC Nestham : వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అగ్రవర్ణ పేదల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఈబీసీ నేస్తం కింద ఏటా రూ.15 వేల జమ చేస్తుంది ప్రభుత్వం. ఈ నెల 24న కర్నూలు జిల్లాలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అగ్రవర్ణాల్లో కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేల దాటని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అయితే కుటుంబ సభ్యులెవరూ ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించి ఉండకూడదు. గత ఏడాది ఈబీసీ నేస్తం కింద రాష్ట్రంలో 4 లక్షల 39వేల మందికి నేరుగా 659 కోట్ల రుపాయలను బదిలీ చేశారు.
ఈబీసీ నేస్తం పథకానికి ఎవరు అర్హులు
ఈబీసీ నేస్తం పథకానికి అర్హులు కావాలంటే వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు రూ. 10 వేలు, పట్టణాల్లో నెలకు రూ. 12 వేలు పరిమితిని మించకూడదు. అలాగే మాగాణి భూమి 3 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి. మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలని పరిమితి ఉంది. మాగాణి, మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలనే నిబంధన కూడా ఉంది. ఇక మున్సిపాలిటీలో 750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదనే షరతు ఉంది. అయితే కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి గాని, పింఛన్ తీసుకునేవాళ్లు ఉండకూడదు. ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంటుంది. ఈ పథకంలో అర్హులైన మహిళ పేరు మీద ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మహిళ వయసు ధ్రువీకరణకు సరైన ఫ్రూప్ ఉండాలి.
16న వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల
అలాగే ఈ నెల 16న చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ చేయూత పథకం కింద మహిళల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేయనున్నారు. సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బుల్ని విడుదల చేస్తారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.18,750 ఆర్థిక సాయం అందిస్తోంది.
అయితే ఈ ఏడాది ప్రభుత్వ పథకాలు, అకౌంట్లలో నగదు జమ షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటించారు. ఫిబ్రవరి 16న కుప్పం నుంచి వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 21న అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 24 కర్నూలు నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న గుంటూరులో నాలుగో విడత విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్నారు. మార్చి 5న సత్యసాయి జిల్లా నుంచి రెండో విడత వసతి దీవెన నిధులు విడుదల చేస్తారు.
సంబంధిత కథనం