IAS Krishna Teja : డిప్యూటేషన్ కు గ్రీన్ సిగ్నల్..! ఏపీకి రానున్న IAS కృష్ణ తేజ, ఆ శాఖనే చూస్తారా..?-kerala cadre ias officer krishna teja allowed to go to andhrapradesh on deputation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ias Krishna Teja : డిప్యూటేషన్ కు గ్రీన్ సిగ్నల్..! ఏపీకి రానున్న Ias కృష్ణ తేజ, ఆ శాఖనే చూస్తారా..?

IAS Krishna Teja : డిప్యూటేషన్ కు గ్రీన్ సిగ్నల్..! ఏపీకి రానున్న IAS కృష్ణ తేజ, ఆ శాఖనే చూస్తారా..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 12, 2024 09:17 PM IST

IAS Krishna Teja : కేరళ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి ఎం. కృష్ణ తేజను డిప్యూటేషన్‌పై ఏపీ వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం డీఓపీటీ ఉత్తర్వులిచ్చింది.

కేరళ ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజ
కేరళ ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజ (photo source from @mvrkteja twitter)

IAS Krishna Teja : కేరళ లో ఐఏఎస్‌ అధికారిగా పని చేస్తున్న  కృష్ణతేజ ఏపీకి రానున్నారు. డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ శుక్రవారం డీఓపీటీ(డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఉత్తర్వులిచ్చింది.  ఏపీలో ఆయనకు పంచాయతీ రాజ్ శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.

yearly horoscope entry point

ప్రస్తుతం కృష్ణతేజ కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సమర్థువంతమైన ఐఏఎస్‌ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణతేజను డిప్యూటేషన్ పై ఏపీకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించింది. ఈ క్రమంలోనే… డిప్యూటేషన్ కు అనుమతులు వచ్చాయి.

ఏపీలో  కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే ఆయన శాఖలోనే కృష్ణతేజ విధులు నిర్వర్తించబోతున్నారనే వార్తలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజుల కిందట రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తోనూ కృష్ణతేజ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత… ఐఏఎస్ కృష్ణతేజ ఏపీకి రావటం ఖరారే అన్న చర్చ జోరుగా వినిపించింది.

ఐఏఎస్ కృష్ణతేజను రాష్ట్రానికి రప్పించేందుకు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ చొరవ తీసుకోవటంతో ఆ దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ప్రభుత్వం… డిప్యూటేషన్ కు తాజాగా అనుమతులు ఇచ్చింది. దీంతో ఆయన ఏపీలో బాధ్యతులు నిర్వర్తించబోతున్నారు. దాదాపు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చూస్తున్న పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏపీ సర్కార్ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంటుంది.

ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన కృష్ణతేజ… 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం తిసూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. అంతకుముందు కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా వ్యవహరించారు. ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తూ వచ్చారు. ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా ఆయన్ను వరించాయి.

 

Whats_app_banner