Chandrababu - Pawan Meeting: చంద్రబాబుతో పవన్ భేటీ.. పొత్తు పొడిచేనా..?
pawan kalyan met chandrababu at hyderabad: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులతో పాటు పొత్తుల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా భేటీపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వీరి మధ్య ఏ అంశాలు చర్చకు రావొచ్చనే దానిపై ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో వైసీపీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కందుకూరు, గుంటూరు సభలో తొక్కిసలాట కారణంగా ఏకంగా 11 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా వైసీపీ ప్రభుత్వం ఈ జీవో తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధించింది. మరోవైపు ఈ జీవో ఇచ్చిన తర్వాత కుప్పం పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. దీంతో అక్కడ పరిస్థితులు పూర్తిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారులతో చంద్రబాబు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ తీరును కూడా తీవ్రంగా ఖండించారు.
కొద్దిరోజుల కిందట జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించారు. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. విశాఖ పర్యటనకు వచ్చిన పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. వీధుల్లో పవర్ కట్ చేయటం వంటి ఘటనలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో పవన్ వెనుదిరిగారు. ఈ సమయంలో పవన్ కు స్వయంగా కలిసిన చంద్రబాబు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ పరిణామంతో మరోసారి టీడీపీ - జనసేన పొత్తు అంశం తెరపైకి వచ్చింది. మరోసారి ఇద్దరు కలిసి పని చేసేందుకు ప్రాథమికంగా సిద్ధమయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. ఇంతలోనే విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ తో పవన్ భేటీ అయ్యారు. మళ్లీ కాస్త సైలెంట్ అనిపించిన పవన్... సమయం దొరికినప్పుడల్లా ఓటు బ్యాంక్ విషయంలో మాత్రం కీలక వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవటం, జీవో నెంబర్ 1 తీసుకువచ్చిన నేపథ్యంలో... చంద్రబాబును పవన్ స్వయంగా కలిసి సంఘీభావం చెప్పేందుకు వచ్చారని తెలుస్తోంది. తాజా పరిణామంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అధికారిక ప్రకటన మాత్రమే ఉందనే వాదన జోరందుకుంది. తాజా భేటీలో పొత్తులపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. అయితే త్వరలోనే లోకేశ్ పాదయాత్ర, వారాహి వాహనంతో పవన్ బస్సు యాత్రకు కూడా సిద్ధమైన సంగతి కూడా తెలిసిందే.
వైసీపీ కౌంటర్ షూర్...
చంద్రబాబు - పవన్ భేటీపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూన్నారు. భేటీ అయిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియా వేదికగా పలువురు నేతలు పోస్టులు చేశారు. ఎన్నికలు వచ్చే వేళ్ల చేరాల్సిన చోటుకే పవన్ చేరాడంటూ సెటైర్లు విసురుతున్నారు. దత్తపుత్రుడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.