AP Enquiry Commission : తొక్కిసలాట ఘటనలపై విచారణ కమిషన్.. జీవో జారీ-andhra pradesh government appoints enquiry commission on stampedes occured in kandukur and guntur ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Enquiry Commission : తొక్కిసలాట ఘటనలపై విచారణ కమిషన్.. జీవో జారీ

AP Enquiry Commission : తొక్కిసలాట ఘటనలపై విచారణ కమిషన్.. జీవో జారీ

HT Telugu Desk HT Telugu
Jan 07, 2023 11:20 PM IST

AP Enquiry Commission : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కారణాలు, బాధ్యులను గుర్తించాలని.. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరింది.

తొక్కిసలాట ఘటనలపై విచారణ కమిషన్ ఏర్పాటు
తొక్కిసలాట ఘటనలపై విచారణ కమిషన్ ఏర్పాటు

AP Enquiry Commission : రాష్ట్రంలో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఓ వైపు దుమారం రేగుతోండగా... ఏపీ ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కందుకూరు, గుంటూరు ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ఏపీ సర్కార్... ఈ ఘటనలపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషశాయన రెడ్డితో కమిషన్ ఏర్పాటు చేసింది. తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులు, బాధ్యుల పై విచారణ చేయనున్న కమిషన్... నెలరోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 7 జారీ చేసింది.

కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలు, ఆ పరిస్థితులకు దారి తీసిన కారణాలు, బాధ్యులెవరు అన్న అంశాలపై కమిషన్ విచారణ చేస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. సభల నిర్వహణలో సరైన ఏర్పాట్లు చేశారా లేదా ? ప్రభుత్వం ఇచ్చిన అనుమతులని ఉల్లంఘించారా ? ఒక వేళ ఉల్లంఘిస్తే అందుకు బాధ్యులెవరు అనే అంశాలను కమిషన్ తేలుస్తుందని వెల్లడించింది. అలాగే.. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా వ్యవస్థీకృతంగా తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన విధానాలపై ప్రతిపాదనలు ఇస్తుందని .. ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి విచారణను నెల రోజుల్లో ముగించి కమిషన్ నివేదిక సమర్పిస్తుందని వెల్లడించింది.

ఇటీవల కందుకూరు, గుంటూరులో జరిగిన చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 28న నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గుంటూరులో జనవరి 1న జరిగిన చంద్రన్న కానుక పంపిణీలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో... రాష్ట్రంలో రాజకీయ పార్టీల రోడ్ షోలు, ర్యాలీలు, రోడ్లపై సభలపై ఆంక్షలు విధిస్తూ.. ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసింది. ఈ ఉత్తర్వులు దుమారం రేపాయి. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఆంక్షల అమలులో భాగంగా.. ఏపీ పోలీసులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటనపై నోటీసులు ఇచ్చారు. బాబు కుప్పం పర్యటనను అడ్డుకున్నారు. ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... సభల నిర్వహణలో వైఎస్సార్సీపీకి ఒక రూలు... మాకో రూలా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరుసటి రోజే... ఏపీ ప్రభుత్వం కందుకూరు, గుంటూరు ఘటనలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది.

IPL_Entry_Point