Twitter followers of telugu leaders : అక్కడ జగన్, బాబు కన్నా పవన్ కే ఎక్కువ.. కానీ.. ?-telugu states politicians focus on increasing twitter followers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Telugu States Politicians Focus On Increasing Twitter Followers

Twitter followers of telugu leaders : అక్కడ జగన్, బాబు కన్నా పవన్ కే ఎక్కువ.. కానీ.. ?

HT Telugu Desk HT Telugu
Dec 25, 2022 03:34 PM IST

Twitter followers of telugu leaders : సాంకేతిక యుగంలో రాజకీయ నేతలు డిజిటల్ వేదికలను సమర్థంగా వినియోగిస్తున్నారు. ప్రధానంగా ట్విటర్ లో ఫాలోవర్లను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో… బర్డ్ యాప్ లో తెలుగు నేతలకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు.. ? ఏపీ సీఎం జగన్ కన్నా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ ఎంత పైచేయి సాధించారు.. ?

ట్విటర్ లో తెలుగు నేతలు
ట్విటర్ లో తెలుగు నేతలు

Twitter followers of telugu leaders : రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలతో నిత్యం కనెక్టడ్ గా ఉండాలని చూస్తారు. ప్రజల కోసం పార్టీ పరంగా వారు చేస్తున్న కార్యక్రమాలు, పోరాటాలు, అధికార పక్షాల వైఖరిని ఎండగట్టే విధానాలను .. అందరికీ చేరవేసేందుకు లీడర్లు ఇన్నాళ్లు మీడియాపైనే ఎక్కవగా ఆధారపడ్డారు. టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ఎక్కువగా పత్రికలను తమ సాధనాలుగా ఉపయోగించుకున్న పొలిటికల్ పార్టీలు.. ఎలక్ట్రానిక్ మీడియా రాకతో.. వాటిపై ఫోకస్ చేశాయి. తాము చెప్పదలుచుకున్న విషయాన్ని క్షణాల్లో ప్రజల ముందుకు చేర్చే టీవీ లైవ్ కవరేజ్ లను ఇన్నాళ్లు విపరీతంగా వాడేసుకున్నాయి. ఇప్పటికీ వాడుతున్నాయి. ఈ క్రమంలో దూసుకొచ్చిన సోషల్ మీడియా... సమాచార వ్యాప్తిలో రాజకీయ పార్టీలుగా అనతికాలంలోనే పవర్ ఫుల్ ఆయుధంగా మారింది. తమ అభిప్రాయాలు, పార్టీ విధానాలు, కార్యక్రమాల సమాచారం క్షణాల్లో చేరవేయటంతో పాటు.. ప్రజల స్పందనను కూడా తెలుసుకునేందుకు ఉపయోగపడుతున్న సోషల్ మీడియా వేదికకు.. పొలిటికల్ లీడర్లు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ అంశంలో... తెలుగు రాష్ట్రాల పొలిటీషియన్స్ ఒకరితో ఒకరు పోటీ పడి ఫాలోవర్లను పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

సోషల్ మీడియాకు సంబంధించి రాజకీయ నేతలు ఉపయోగిస్తున్న ప్రధాన యాప్ .. ట్విటర్. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ని కూడా చాలా మంది వాడుతున్నప్పటికీ... ఎక్కువ ఫోకస్ మాత్రం ట్విటర్ పైనే పెడుతున్నారు. ఇందులో ఎంత మంది ఫాలోవర్లు ఉంటే.. వారికి అంత రీచ్ అన్నమాట. ట్విటర్ లో ఎక్కువ మంది అనుసరిస్తున్న తెలుగు లీడర్ల జాబితా చూస్తే... అత్యధిక ఫాలోవర్లతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య 5.2 మిలియన్లుగా ఉంది. అంటే... 52 లక్షల మంది పవన్ కళ్యాణ్ ట్విటర్ అకౌంట్ ను అనుసరిస్తున్నారన్న మాట. అయితే.. కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే ఆయన ఇంత మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారని చెప్పలేం. పాలిటిక్స్ లోకి రాకముందే సినిమా హీరోగా స్టార్డమ్ సాధించారు.. పవన్. అటు సినిమా, ఇటు పాలిటిక్స్ .. కలగలిసిన వ్యక్తిగా ప్రజల్లో ఉన్న గుర్తింపు వల్లే.. పవన్ కళ్యాణ్ ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య మిగతా పొలిటీషయన్ల కన్నా ఎక్కువగా ఉందనే వాదన ఉంది.

ఇక.. పవన్ తర్వాత ట్విటర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న లీడర్.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ట్విటర్ లో ఆయనని అనుసరిస్తున్న వారి సంఖ్య 4.9 మిలియన్లుగా (49 లక్షలు) ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం సీఎంగా సేవలు అందించిన చంద్రబాబు... ఐటీ పరంగా అమలు చేసిన విప్లవాత్మక విధానాలతో.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. డిజిటల్ విప్లవాన్ని అందరికంటే ముందే తానే గుర్తించానని చెప్పే చంద్రబాబు.. 2009లోనే ట్విటర్ ఖాతా ప్రారంభించారు. తన వయసు 60 దాటినా... ఆలోచనలు మాత్రం యువతతో పోటీ పడతాయని చెప్పే బాబు... సోషల్ మీడియాను కూడా ఆధునిక టెకీ ఉపయోగించినట్లు వాడేస్తున్నారు.. !

ట్విటర్ ఫాలోవర్ల పరంగా చూస్తే.. పవన్, బాబు తర్వాతి స్థానంలో.. తెలంగాణ మంత్రి కేటీఆర్ 3.8 మిలియన్ పాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ట్విటర్ లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్.. ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా దీనిని ఉపయోగించుకుంటున్నారు. క్రమం తప్పకుండా ప్రజలతో కనెక్ట్ అవుతుంటారు. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తోన్న ప్రగతి, చేపడుతోన్న వినూత్న కార్యక్రమాలు, వస్తోన్న ఫలితాలను ఈ యాప్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. #askktr పేరుతో ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి ప్రశ్నలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. సందేహాలకు సమాధానాలు ఇస్తూ.. సోషల్ మీడియాను సమర్థంగా వినియోగిస్తున్నారు మంత్రి కేటీఆర్.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అందరి కంటే చాలా ఆలస్యంగా.. ట్విటర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ యాప్ లో వ్యక్తిగత ఖాతాను 2015లో ప్రారంభించారు. ప్రస్తుతం ఆయనకి 2.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. డిజిటల్ యుగంలో.. ప్రజలతో నిత్యం అనుసంధానమై ఉండాలంటే.. సంప్రదాయ మీడియాతో పాటు.. సోషల్ మీడియా అత్యవసరం గుర్తించి.. ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రిగా చేపడుతున్న కార్యక్రమాలు, రాష్ట్రంగా సాధిస్తోన్న ప్రగతి విశేషాలను ట్విటర్ ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారు.. జగన్. తద్వారా.. క్రమంగా ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రధాన నేతల్లో చాలా మంది.. 2 మిలియన్ లోపు ఫాలోవర్లతో ఉన్నారు.

ఇక.. రాజకీయ పార్టీల వారీగా చూస్తే.. జనసేన ట్విటర్ ఖాతాను 1.9 మిలియన్ ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు 827K.. భారత రాష్ట్ర సమితికి 791K... తెలుగుదేశం పార్టీకి 547K.. తెలంగాణ బీజేపీకి 240K.. తెలంగాణ కాంగ్రెస్ 120K.. ఫాలోవర్లు ఉన్నారు. ఇలా... కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి రాజకీయపార్టీలు. సామాజిక మాధ్యమాల ద్వారా తన వాదనను, భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నాయి.

IPL_Entry_Point