Janasena Varahi : “వారాహి”పై రగడ…ఆ రంగు చొక్కా వేసుకోవచ్చా అంటూ పవన్ ట్వీట్…-controversy over pawan kalyans campaign vehicle varahi ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Controversy Over Pawan Kalyans Campaign Vehicle Varahi

Janasena Varahi : “వారాహి”పై రగడ…ఆ రంగు చొక్కా వేసుకోవచ్చా అంటూ పవన్ ట్వీట్…

B.S.Chandra HT Telugu
Dec 09, 2022 11:37 AM IST

Janasena Varahi జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ ప్రచార వాహనం రంగుపై రేగిన రగడ ఇంకా ఆగలేదు. రక్షణ వాహనాలకు వినియోగించే ఆలివ్ గ్రీన్‌ రంగును ఎన్నికల ప్రచార వాహనానికి వినియోగించడంపై విమర్శలు రేగాయి. నిబంధనలకు విరుద్ధంగా మిలట్రీ రంగును పార్టీ వాహనానికి ఎలా వినియోగిస్తారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించడంతో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

పవన్ ప్రచార వాహనంపై రగడ
పవన్ ప్రచార వాహనంపై రగడ

Janasena Varahi : పవన్ కళ్యాణ్‌ ప్రచార వాహనానికి ఆలివ్ గ్రీన్ రంగు బదులు వేరే ఏ రంగు కాకుండా పసుపు రంగు వేసుకోవాలంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న వాహనానికి మిలటరీ వాహనాలకు వేసే ఆలివ్ గ్రీన్ రంగు వేయడం చట్టవిరుద్ధమన్న పేర్నినాని ఆ రంగు, ఈ రంగు వేసే బదులు పసుపు వేయాలని ఎద్దేవా చేశారు. ఆలివ్ గ్రీన్ రంగు వేసిన ప్రైవేట్ వాహనాలకు రిజిస్ట్రేషన్ కూడా చేయరని చెప్పారు. లక్షల పుస్తకాలు చదివానని చెప్పే పవన్ కళ్యాన్‌ ఇండియన్ మోటర్ వెహికల్ యాక్ట్ పుస్తకాన్ని కూడా చదివితే బాగుండేదన్నారు. ఆలివ్ గ్రీన్ రంగు వేసిన వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయరని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

సినిమాల్లో మిలట్రీ దుస్తులు వేసుకుని సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికుల్ని కాల్చి చంపినట్లు నటించవచ్చని, నిజ జీవితంలో అలా సాధ్యపడదని చెప్పారు.డబ్బున్న ప్రతి ఒక్కరు వ్యాన్లు కొనుక్కుని యుద్ధాలు చేస్తామంటే కుదరదని చెప్పారు. పవన్ కళ్యాన్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడైతే ఇవన్నీ తెలిసేవని, కాల్‌షీట్‌ పొలిటిషియన్ కావడంతోనే చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ మినహా ఏమి తెలయడం లేదన్నారు. విశాఖలో మోదీ పలకరించకపోతే ఈ పాటికి చంద్రబాబుతో జత కట్టేవాడని చెప్పారుు. ఎన్నికలకు ముందు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో జత కట్టడం ఖాయమని చెప్పారు.

మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ముందుగా నా సినిమాలను అడ్డుకున్నారు. విశాఖ వెళ్తే హోటల్‌ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. విశాఖ నుంచి బలవంతంగా పంపించేశారు. మంగళగిరిలో నా కారులో వెళ్తుంటే అడ్డుకున్నారు. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న నన్ను ఆపేశారు. ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారు. కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్వీట్‌ చేశారు. ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా?'' అని ఆయన వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

అటు జనసేన నాయకులు కూడా వైసీపీ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడమే వీళ్లకు తెలుసని, హైకోర్టుతో మొట్టికాయలు తిన్నవారు కూడా రంగులు గురించి మాట్లాడడం విడ్డూరమని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. నిబంధనల ప్రకారమే వారాహి వాహనానికి రంగులు వేశారని, ఏపీఎస్ఆర్టీసీని వైసీపీఆర్టీసీగా మార్చేశారని, పార్టీ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలిస్తూ ప్రయాణికులను అవస్థల పాల్జేస్తూ తమను విమర్శించడం ఏమిటని మండిపడ్డారు.

హైకోర్టుతో లెక్కకు మించి మొట్టికాయలు వేయించుకున్న వారు కూడా నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చేపట్టనున్న యాత్రకు సంబంధించిన వారాహి వాహనం రంగులపై వైసీపీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ మూర్ఖత్వాన్ని తెలియచేస్తోంది అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దుకొంటోందని పవన్ కళ్యాణ్ నిబంధనలకు లోబడి నిర్ణయాలు తీసుకుంటారు అన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టానుసారం ప్రజల డబ్బుతో వైసీపీ పార్టీ రంగులు వేసుకునే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయి? ఆ పార్టీ నాయకుల నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమన్నారు. “జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. వైసీపీ అభద్రతాభావంతో వారాహి వాహనం గురించి విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా జనసేన పార్టీ సాంకేతిక సైన్యం పనిచేయాలన్నారు. పాలనలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 30 చెరువుల నీళ్లు తాగించిన ఈ వైసీపీ ప్రభుత్వ దుర్నీతిని ఏమాత్రం భయపడకుండా జనం దగ్గరకు చేరవేయాలన్నారు. ప్రజలను జాగృతం చేసే బాధ్యతను తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్‌ ప్రచార వాహనంపై ఏపీ రవాణా శాఖ అధికారులు కూడా స్పందించారు. వాహనాలకు మిలట్రీ రంగుల వినియోగంపై చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, వాహనాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ డిప్యూటీకమిషనర్ సంకా ప్రసాదరావు చెప్పారు. వాహనం తయారు చేసిన ఛాసిస్ కమర్షియల్ వాహనానికి సంబంధించినదా, రవాణా వాహనానికి సంబంధించినదా అనేది కూడా చూస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తప్పవని చెప్పారు. పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడితే తప్ప వాహనం పొడవు, వెడల్పు, ఎత్తు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుస్తుందన్నారు.

WhatsApp channel

టాపిక్