RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు
RTE Admissions: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ద్వారా పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 25వేల మందిని ఎంపిక చేసినట్టు బాలల హక్కుల కమిషన్ ప్రకటించింది.
RTE Admissions: నిర్బంద విద్యాహక్కు చట్టం ప్రకారం, సెక్షన్ 12 (సి ) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ మరియు అన్‌ఎయిడెడ్ పాఠశాలలలో చదువుకోడానికి అర్హులైన అల్పాదాయ వర్గాల నిరుపేద కుటుంబాల బాలలు, అనాథ బాలల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించారు.
ఏపీలో 26 జిల్లాలకు సంబంధించి " 25125" మంది బాలలకి విద్యా హక్కు చట్టం ద్వారా రాష్ట్ర విద్యాశాఖ ఉచితంగా అడ్మిషన్లు కల్పించింది. ఎంపికైన విద్యార్ధులకు అయా పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ఏటువంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలని బాలల హక్కుల కమిషన్ సూచించింది.
రాష్ట్రం లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో ఆర్టీఈ చట్టం విద్యార్ధులకు సీట్లు లభించాయి. అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరగడంపై ఆంధ్ర ప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. బాలల హక్కుల కమిషన్ విద్యాహక్కు చట్టం పనితీరుపై విద్యా శాఖ సమన్వయంతో పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.
సీట్ల కేటాయింపులో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి ప్రవేశాలు కల్పించాలని, ఉల్లంఘనకు పాల్పడిన విద్యాసంస్థలపై కమిషన్ ద్వారా కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలల్లో అడ్మిషన్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మంగళగిరి లోని కమిషన్ కార్యాలయానికి apscpcr2018@gmail కు ఫిర్యాదు చేయవొచ్చని అప్పారావు సూచించారు.
ఏపీలో విద్యా హక్కు చట్టం(Right To Education) కింద పేద విద్యార్థులకు ప్రైవేటు బడుల్లో 25 శాతం ప్రవేశాలు(AP RTE Admissions) కల్పించేందుకు ఈ ఏడాది మార్చిలో దరఖాస్తులు స్వీకరించారు. అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ cse.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ ప్రకటించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 9350 ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టం కింద వివరాలు నమోదు చేసుకున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 25శాతం సీట్లను ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో పేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.
అర్హతలు
సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణాల్లో 1.44 లక్షలు ఉన్న వారు దరఖాస్తు (AP RTE Applications)చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 18004258599 ను సంప్రదించాలని సూచించారు. అయితే రాష్ట్ర సిలబస్ తో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలో చేరేందుకు ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి విద్యార్థికి ఐదేళ్లు నిండాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సిలబస్ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థికి 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఐదేళ్లు నిండాలని తెలిపారు.
విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను వివిధ దశల్లో పరిశీలించిన అనంతరం ఏప్రిల్ 1న మొదటి విడత ఫలితాలు(AP RTE Admissions Results) విడుదల చేస్తారు. ఏప్రిల్ 15న రెండో విడత ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయిస్తారు.
విద్యాహక్కు(RTE) చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తారు. వచ్చే విద్యాసంవత్సరం(2024-25) అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో(Private Schools) 25 శాతం సీట్లు 1వ తరగతి విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది. .
ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్12(1) (C) ప్రకారం 2023-2024 విద్యా సంవత్సరంలో అన్ని రకాల బడుల్లో అడ్మిషన్లు కేటాయించారు. మొదటి విడత ఫేజ్1లో అడ్మిషన్ కేటాయించని పిల్లలతో పాటు రెండవ విడతలో దరఖాస్తు చేసుకున్న పిల్లలకు లాటరీ ద్వారా 14192 మంది విద్యార్ధులను ఉచిత నిర్బంధ విద్య పథకానికి ఎంపిక చేశారు. గత ఏడాది 14192మంది అడ్మిషన్లు కల్పిస్తే ఈ ఏడాది 25125 మంది ఆర్టీఇ ద్వారా అడ్మిషన్లు కల్పించారు.
సంబంధిత కథనం