RTE Free Seats : ఆ సీట్లు భర్తీ చేయాల్సిందే.....
RTE Free Seats : ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత అడ్మిషన్లు అమలు చేయాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. సెప్టెంబర్ 5 నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని ఆదేశించారు.
విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందంటూ హైకోర్టుకు ఫిర్యాదులు అందడం, హైకోర్టు అధికారుల్ని జైళ్లకు పంపాల్సి ఉంటుందని హెచ్చరికల నేపథ్యంలో విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిందేనని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. సామాజిక అసమానతలు తొలగించే క్రమంలో వివిధ వర్గాలకు నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం RTE Free Seats అడ్మిషన్లు జరపాల్సిందేనని స్పష్టం చేశారు.
ఒకటో తరగతి అడ్మిషన్లలో 25శాతం పేదలకు కేటాయించాలని విద్యాశాఖ ఆదేశించింది. అనాథలు, హెచ్‌ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులు పిల్లలకు ఐదు శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 4శాతం, బిసి, మైనార్టీ, ఓసి వర్గాలకు చెందిన పిల్లలకు 6శాతం RTE Free Seats సీట్లను కేటాయించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హత కలిగిన పిల్లలకు ఒకటో తరగతి విద్యార్దులను నమోదు చేసే సమయంలో విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాల కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ.1.20లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.4లక్షల ఆదాయం ప్రాతిపదికగా RTE Free Seats అర్హులను ఎంపిక చేస్తారు. ఆర్టీఈ యాక్ట్ 2009 12(1)(సి) నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని ఆగష్టు 16 నుంచి 26వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన విద్యార్ధుల జాబితాను జిల్లా విద్యాశాఖాధికారుల ద్వారా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు పంపారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు ఆ సమాచారాన్ని మొబైల్ ఫోన్లకు మెసేజ్ రూపంలో పంపారు. RTE Free Seats అడ్మిషన్ ప్రక్రియను వెంటనే చేపట్టేలా జిల్లా విద్యాశాఖాధికారులు, అదనపు పథక సమన్వయాధికారులకు అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉచిత నిర్బంధ విద్యకు ఎంపికైన విద్యార్ధుల తల్లిదండ్రులు, సంరక్షకులకు సమాచారం ఇచ్చి సెప్టెంబర్ 5 నుంచి 12వ తేదీ లోపు అడ్మిషన్లు పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. నిర్దేశిత తేదీలలో అడ్మిషన్లు చేయకపోతే వారి అడ్మిషన్లు రద్దవుతాయని హెచ్చరించారు. విద్యార్ధులను పాఠశాలల్లో చేర్చుకునే సమయంలో వారి సర్టిఫికెట్లు పరిశీలించి అడ్మిషన్లను ధృవీకరించుకోవాలని పాఠశాలలకు విద్యాశాఖ సూచించింది.
ఆర్టీఈ పథకానికి ఎంపికైన విద్యార్థుల జాబితాల జాబితా https://cse.ap.gov.in/DSE వెబ్ పోర్టల్‌లో ఉంచారు. ఆర్టీఈ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలతో పాటు పాఠశాలల యాజమాన్యాలు నోటు పుస్తకాలు, యూనిఫాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ ప్రకారం అవసరమైన సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ సూచించారు. .
టాపిక్