RTE : ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు ఉచిత అడ్మిషన్లు….
విద్యా హక్కు చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్ధులకు అడ్మిషన్లను కల్పించేందుకు ఏపీ పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్ధులకు అడ్మిషన్లు కల్పిస్తారు. వారికి అయ్యే ఫీజుల్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
విద్యా హక్కుచట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం సీట్లను పేద విద్యార్ధులతో భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. ఆగష్టు 10న పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల కానుంది. ఒకటో తరగతిలో అడ్మిషన్లు పొందాలనుకునే విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయా పాఠశాలల్లో సీట్ల లభ్యతను బట్టి విద్యార్ధుల్ని లాటరీలో కేటాయిస్తారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఇంటికి కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పోర్టల్‌లో ఎంచుకున్న తర్వాత సీట్ల లభ్యతను బట్టి లాటరీలో అడ్మిషన్లు కల్పిస్తారు. విద్యా సంస్థల్లో ఖాళీలు ఉంటే మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యా సంస్థల్లో కూడా అడ్మిషన్లు కల్పిస్తారు.
సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో అడ్మిషన్లు ముగియడంతో వాటిలో ఈ ఏడాది అడ్మిషన్లు ఇవ్వరు. వచ్చే ఏడాది అడ్మిషన్ నోటిఫికేషన్ ముందే విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు ఇస్తారు. ఒక్కో విద్యార్ధికి ప్రభుత్వం రూ.15,538రుపాయలు ఫీజుగా చెల్లిస్తుంది.
ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్ పొందాలనుకుంటున్న విద్యార్ధులు ఆగష్టు 16 నుంచి 26 లోపు https://cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ విద్యా హక్కు చట్టం, ఉచిత, నిర్బంధ విద్య బాలల హక్కు చట్టాల మేరకు అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నోటిఫికేషన్ ఆగష్టు 10న విడుదలవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఆగష్టు 16నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆగష్టు 30న లాటరీలో ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 2న మొదటి జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 2 నుంచి 9 మధ్య రెండో జాబితాలో మిగిలి పోయిన సీట్లకు విద్యార్ధుల్ని ఎంపిక చేస్తారు. రెండో విడత ఎంపిక సెప్టెంబర్ 12-30 మధ్య నిర్వహిస్తారు.