AP Paddy Procurement: దళారుల్ని నమొద్దు.. 93 శాతం రైతులకు కొనుగోలు చేసిన 24గంటల్లోనే ధాన్యం డబ్బులు..
AP Paddy Procurement: ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు చేస్తున్నామని, ఇప్పటి వరకు పదిలక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగొలు చేసి చేసినట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు.73373 59375 నెంబరుకు హాయ్ అని మెసేజీ చేస్తే రైతు వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు.
AP Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లలో రైతులు దళారుల్ని ఆశ్రయించ వద్దని మంత్రి నాదెండ్ల సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తొమ్మిది లక్షల 91వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.2,283 కోట్లు నగదు చెల్లించామన్నారు. ఇందులో రూ.2,067 కోట్లు సొమ్మును ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లోనే చెల్లించినట్లు తెలిపారు.
తుఫాను నేపథ్యంలో 40 రోజులపాటు జరగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కేవలం మూడు రోజుల్లో హడావిడిగా జరుగుతున్న నేపధ్యంలో ఎదురైన సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులకు రూ.1,674 కోట్ల బకాయిలు మిగిల్చినా తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే రైతుల ధాన్యం బకాయిలు పూర్తిగా చెల్లించినట్లు తెలిపారు.
కౌలు రైతులకు కూడా ఈ క్రాప్ నమోదు చేసి ధాన్యం సొమ్ము నేరుగా వారి ఖాతాలకే తెలుస్తున్న ఘనత తమ కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతులు తమకు నచ్చిన మిల్లుకే ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించటంతో పాటు జిపిఎస్ నిబంధన కూడా తొలగించామన్నారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కొందరు మిల్లర్లు దళారులు కలసి ధర తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అరికట్టేందుకు కఠినమైన చర్యలు చేపడతామన్నారు. రైతులకు ఇబ్బంది కలిగించే మిల్లర్లపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇరవై ఐదు శాతం తేమ ఉన్నా తక్షణమే ధాన్యం కొనేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
డ్రయ్యర్ల సౌకర్యం ఉన్న మిల్లులకు క్వింటాకు తొమ్మిది రూపాయలు ఎఫ్.సీ.ఐ ద్వారా నిధులు అందిస్తామన్నారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ సేవలు వినియోగించుకుని 73373 59375 నెంబరుకు రైతు హాయ్ అని పోస్ట్ చేస్తే అధికారులే రైతు వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే సౌకర్యం తెచ్చినట్లు తెలిపారు.
రైతులు పండించిన 1262 రకం ధాన్యం మొత్తం మిల్లర్లు కొనాలని మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది ప్రతిరోజు తప్పనిసరిగా 5-6 గంటలు క్షేత్ర స్థాయిలో తిరిగి రైతులకు సహకరించాలని ఆదేశించారు.
'రైతు పండించిన చివరి బస్తా వరకు కొనుగోలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి బస్తాకు కనీస మద్దతు ధర చెల్లించే కొనుగోలు చేసే బాధ్యతను తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు భరోసా ఇచ్చారు.
మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలగకుండా తమ వంతు సహకారం అందించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. కనీస మద్దతు ధర వ్యవహారంలో అవకతవకలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు. మిల్లర్ల వద్ద మోసం జరిగిందన తెలిస్తే అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు.
వాతావరణ పరిస్థితులను అడ్డుపెట్టుకుని కొంత మంది దళారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని, కనీస మద్దతు ధర కంటే తక్కువ చెల్లించి కొనుగోలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుధవారం కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో ధాన్యం కొనుగోళ్లపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపారు.
వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా 40 రోజులపాటు సాగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ మూడు రోజుల్లో చేపట్టాల్సి రావడంతో కొంత మేర ఇబ్బందులు తలెత్తాయి. ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించి రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించాము. రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే డబ్బు వారి ఖాతాల్లో జమ అయిపోతుంది. 24 గంటల్లో 93 శాతం రైతులకు డబ్బు వారి ఖాతాల్లో పడిపోయింది.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 2,800 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే లక్షా 24 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు.
ఎమ్మెస్పీకి కొనాల్సిందే…
ఏపీలో కనీస మద్దతు ధర రూ. 1725కి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది దళారులు వర్షాలు వచ్చాక రైతులను మభ్యపెట్టి రూ. 1400 కి కొనే ప్రయత్నం చేస్తున్నారని. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తేమ శాతం కూడా కొంచెం అటూ ఇటుగా ఉన్నా కొనుగోలు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులలో 25 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించినట్టు వివరించారు. రూ. 1725 కనీస మద్దతు ధరకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మిల్లర్లకు సైతం ఉందని ఖరీఫ్ నాటికి అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు.