Konaseema Tragedy: కోనసీమలో పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు, తల్లి ఇద్దరు కుమారుల దుర్మరణం
Konaseema Tragedy: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. అరకు విహార యాత్ర ముగించుకుని పోలవరం వెళుతున్న కుటుంబంలో ఈ ప్రమాదం విషాదాన్ని నింపింది.
Konaseema Tragedy: అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉడిముడిలో ఘోర ప్రమాదం జరిగింది. తెల్ల వారుజామున నిద్రమత్తులో కారు నడపడంతో పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు.
వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి పంట కాల్వలలోకి దూసుకెళ్లడంతో తల్లి కుమారులు మృతి చెందిన ఘటన కోనసీమలో జరిగింది. పోలవరంకు చెందిన నేలపూడి విజయ్‌కుమార్ కుటుంబం విహార యాత్ర కోసం అరకు వెళ్లారు. యాత్ర ముగించుకుని అరకు నుంచి పోలవరం వెళుతుండగా మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిముడి శివార్లలో ఈ ప్రమాదం జరిగింది. ఉడిముడి శివార్లలో చింతవారి పేట వద్ద నేలపూడి విజయ్‌కుమార్ భార్య ఉమ కారు నడుపుతుండగా ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే విజయ్‌కుమార్ నీటి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
ప్రమాదం జరిగిన సమయంలో విజయ్ కుమార్ భార్య ఉమ కారు నడుపుతున్నట్టు చెబుతున్నారు. కారు ప్రమాదానికి గురైన సమయంలో చిమ్మ చీకటిగా ఉండటంతో సహాయచర్యలకు ఆటంకం కలిగింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు హుటాహుటిన బాధితుల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈత వచ్చిన విజయ్‌కుమార్ పంట కాల్వ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు.
ఆ తర్వాత కుమారులు మనోజ్, గోపీ, భార్య ఉమ మృతదేహాలను పంట కాల్వల నుంచి వెలికి తీశారు. కాసేపట్లో ఇంటికి వెళ్లిపోతామనుకుంటే ప్రమాదంలో భార్య, కుమారులు ప్రాణాలు కోల్పోవడంతో బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు.