Manchu Family Issue : మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు.. మోహన్‌బాబుపై సంచలన ఆరోపణలు
Manchu Family Issue : మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదిరింది. తాజాగా మంచు మనోజ్, అతని భార్య మౌనికపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు మనోజ్ ఫిర్యాదులో మోహన్‌బాబు అనుచరులపైనా కేసు నమోదైంది. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో.. మంచు ఫ్యామిలీ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా పహాడీషరీఫ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు ఫిర్యాదుతో మనోజ్‌పై కేసు నమోదైంది. మనోజ్ భార్య మౌనికపై కూడా కేసు నమోదు చేశారు. మనోజ్, మౌనికపై 329, 351 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మనోజ్ ఫిర్యాదుతో మోహన్‌బాబు అనుచరులపై కేసు నమోదు చేశారు. 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదైంది. జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి చుట్టూ బౌన్సర్లు భారీగా మోహరించారు.
మోహన్‌బాబు ఫిర్యాదు..
తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని మోహన్‌బాబు రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. జల్‌పల్లిలో 10 ఏళ్లుగా తాను నివసిస్తున్నానని మోహన్ బాబు వివరించారు. నాలుగు నెలల కిందట మనోజ్ ఇల్లు వదిలి వెళ్లారన్నారు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి తన ఇంటి వద్ద ఆదివారం కలవరం సృష్టించారని ఆరోపించారు. మనోజ్ తన కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులతో చొరబడి సిబ్బందిని బెదిరించారని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.
మనోజ్ రియాక్షన్..
'నేను ఎప్పుడూ ఆర్థిక సాయం కోసం నా కుటుంబంపై ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తులను కోరలేదు. నేను ప్రస్తుతం మా నాన్న ఇంట్లోనే నివసిస్తున్నాను. నా సోదరుడు దుబాయ్‌కి వెళ్లిన తర్వాత మా అమ్మ నన్ను ఇంటికి రమ్మని పిలిచారు. నేను మా నాన్నకు చెందిన ఇంట్లోకి మారాను. ఏడాదికిపైగా అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. నేను తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల కిందట ఆ ఇంట్లోకి వచ్చినట్లు నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. నన్ను, నా భార్యను ఇరికించే ఉద్దేశంతో ఆరోపణ చేశారు. నేను ఆ ఇంట్లో నివసిస్తున్నానని నిర్ధారించుకోవడానికి.. గత సంవత్సరం నుంచి నా మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్‌ను పరిశీలించాలని అధికారులను అభ్యర్థిస్తున్నాను' అని మనోజ్ స్పష్టం చేశారు.
'ఈ వివాదంలోకి నా 7నెలల కుమార్తెను లాగడం చాలా బాధకరం. వివాదంలోకి నా పిల్లలను లాగడం వెనకున్న ఉద్దేశం ఏంటి? కుటుంబ పెద్దల పట్ల అత్యంత గౌరవం చూపే నా భార్యకు ఉద్దేశాలు ఆపాదించబడడం దురదృష్టకరం. ఇంట్లో పనిచేసే మహిళలను కూడా మా నాన్న తిడుతూ ఉంటారు. వారు తీవ్రమైన మనోవేదనకు గురయ్యేవారు. అందుకు అవసరమైన అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా కూతుర్ని పట్టించుకోకుండా వదిలేశామని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. మా అమ్మ పర్యవేక్షణతో పాటు ఆయా వద్ద మా కూతురిని ఉంచాం. నా భార్య, నేను కేవలం నాకు తగిలిన గాయాల వైద్య చికిత్స కోసం ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లాం' అని మనోజ్ వివరించారు.