RTE : పేదల కోటాను వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ స్కూల్స్‌…..-private schools opposes 25 percent quota for poor students in admissions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rte : పేదల కోటాను వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ స్కూల్స్‌…..

RTE : పేదల కోటాను వ్యతిరేకిస్తున్న ప్రైవేట్ స్కూల్స్‌…..

HT Telugu Desk HT Telugu
Aug 20, 2022 12:17 PM IST

ప్రైవేట్ పాఠశాలల్లో పేదల కోటా అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అన్‌ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం ఫీజులు ఎప్పుడు చెల్లిస్తుందో తెలియకుండా, విద్యార్ధుల తల్లిదండ్రులకు రీయింబర్స్‌ చేస్తే ప్రైవేట్ పాఠశాలలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

<p>ఏపీలో ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు ఉచిత అడ్మిషన్లపై &nbsp;రగడ</p>
ఏపీలో ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు ఉచిత అడ్మిషన్లపై రగడ (L. Anantha Krishnan)

పాఠశాల అడ్మిషన్లలో పేదలకు 25శాతం కోటా అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రైవేట్ పాఠశాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సరైన నియమ నిబంధనలు లేకుండా ఏకపక్షంగా ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు కోటా అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడంపై పాఠశాలలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఏపీలో పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించేందుకు విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలను కల్పిస్తూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనాథలు, దివ్యాంగులు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనార్టీ, ఓసీలకు 6 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సరిగా రూపొందించకుండానే ఉత్తర్వులు జారీ చేసిందని ప్రైవేటు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఫెడరేషన్‌ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 శాతం సీట్లు పేద పిల్లలకు కేటాయించడమంటే దాదాపు 1.67 లక్షల మంది విద్యార్ధులు దీని ద్వారా ప్రైవేటు స్కూల్స్‌లో జాయిన్‌ అవుతారని అంచనా వేస్తున్నారు. దీని వల్ల ప్రైవేటు స్కూల్స్‌ నిర్వహణ వ్యయం భారంగా మారుతుందని, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడంతో పాటు మరిన్ని నిర్వహణ ఖర్చులు కూడా అధికమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు.ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతాయని ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు ప్రారంభమై రెండు నెలలు కావొస్తుందని, ఇప్పుడు విద్యార్ధులను చేర్చుకుంటే తరగతులలో ఇబ్బంది ఎదురవుతుందని ఆందోళన చెందుతున్నారు. పేదల కోటాపై ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్దుల తల్లిదండ్రులకు బదులుగా ప్రభుత్వం నేరుగా పాఠశాలలకు ఫీజును చెల్లిస్తానంటే ఈ నిర్ణయం తమకు అంగీకరమేనంటున్నారు. 1.67 లక్షల మంది విద్యార్ధుల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం ద్వారా చెల్లిస్తామంటే ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని, వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన ఖర్చును, ఉపాధ్యాయుల జీతాలను చెల్లించాలని సకాలంలో ప్రభుత్వం చెల్లించకపోతే పాఠశాలలు నష్టపోతాయమని ఆందోళన చెందుతున్నారు. ఏపీలో 16,786పాఠశాలల్లో 6.71లక్షల మంది విద్యార్ధులు ఒకటో తరగతిలో అడ్మిషన్లు పొందారని 25శాతం కోటా అమలుచేయాల్సి వస్తే 1.67 లక్షల మందికి ఫీజును ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందంటున్నారు.

మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను ఇంకా నిర్ణయించలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం 25శాతం కోటాను పాఠశాలలు అమలు చేయాల్సిందేనని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు ఇంటి దగ్గర్లో ఉన్న పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారని చెబుతున్నారు.

Whats_app_banner