AP RTE Admissions : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ప్రైవేట్ బడుల్లో ఉచిత ప్రవేశాలు- ఎలా అప్లై చేయాలంటే?
AP RTE Admissions : విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు కేటాయించే 25 శాతం ప్రవేశాలకు అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. అర్హులైన విద్యార్థులు నేటి నుంచి అధికారిక వెబ్ సైట్ cse.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
AP RTE Admissions : ఏపీలో విద్యా హక్కు చట్టం(Right To Education) కింద పేద విద్యార్థులకు ప్రైవేటు బడుల్లో 25 శాతం ప్రవేశాలు(AP RTE Admissions) కల్పిస్తున్నారు. ఈ ప్రవేశాలకు నేటి(మార్చి 5) నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ cse.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9350 ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టం కింద వివరాలు నమోదు చేసుకున్నాయని తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 25శాతం సీట్లను ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో పేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.
అర్హతలు
సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణాల్లో 1.44 లక్షలు ఉన్న వారు దరఖాస్తు (AP RTE Applications)చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 18004258599 ను సంప్రదించాలని సూచించారు. అయితే రాష్ట్ర సిలబస్ తో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలో చేరేందుకు ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి విద్యార్థికి ఐదేళ్లు నిండాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సిలబస్ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థికి 2024 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఐదేళ్లు నిండాలని తెలిపారు.
ఏప్రిల్ 1, 15న ఫలితాలు
విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను వివిధ దశల్లో పరిశీలించిన అనంతరం ఏప్రిల్ 1న మొదటి విడత ఫలితాలు(AP RTE Admissions Results) విడుదల చేస్తారు. ఏప్రిల్ 15న రెండో విడత ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు 6 శాతం సీట్లు కేటాయిస్తారు.
ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ లోని ఆదర్శ పాఠశాలల్లో (AP Mode Schools) ఆరో తరగతిలోప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 1వ తేదీన ప్రకటన విడుదలకాగా… మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష జరగనుంది. https://apms.apcfss.in/ వెబ్ సైట్ లో వివరాలను చూడవచ్చు.
ముఖ్య వివరాలు :
- ప్రవేశాలు - ఏపీ మోడల్ స్కూల్స్
- ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
- ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత కలిగి ఉండాలి.
- ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2012 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 01.09.2010 -31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.
- రుసుం - ఓసీ, బీసీ విద్యార్థులు రూ.150 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 75 కట్టాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం - మార్చి 01,2024.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31. మార్చి.2024.
- పరీక్ష తేదీ -21. ఏప్రిల్ .2024 (ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఉండే స్థానిక మండల కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది.)
సంబంధిత కథనం