AP School Holidays : ఏపీలో ఎల్లుండి నుంచి దసరా సెలవులు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
AP School Holidays : ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి నుంచి ఈనెల 13వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ.. నిర్ణయం తీసుకుంది. 14న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్‌లో పేర్కొన్న తేదీ కంటే ముందే దసరా సెలవులను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచే దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్టోబర్ 13వ తేదీతో సెలవులు ముగియనున్నాయి. అక్టోబర్ 14వ తేదీన తిరిగి విద్యా సంస్థలు పునః ప్రారంభం కానున్నాయి.
దీనికి సంబంధించి తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీలో ఎల్లుండి నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయని.. ఈ నెల 13 వరకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 14న పాఠశాలల పునః ప్రారంభం ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విద్యా సంస్థల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. క్రిస్టియన్ మైనారిటీ సంస్థలు కూడా ఈ ఉత్తర్వులను పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇటీవల విద్యాశాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. నవంబర్ 11 న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. నవంబర్ 14న మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించేలా అధికారులను ఆదేశించారు.
అటు బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 3 నుంచి 12 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఎన్టీఆర్ జిల్లా అధికారులు, దేవాదాయ శాఖ, పోలీసు శాఖల సమన్వయంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా.. అమ్మవారు 12 అవతారాలలో దర్శనమిస్తుంది. తొలిరోజు అక్టోబరు 3న అమ్మవారిని శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. అక్టోబర్ 4న శ్రీ గాయత్రీదేవి అలంకారంలో, 5న శ్రీ అన్నపూర్ణాదేవిగా, 6న శ్రీ లలితా త్రిపురగా అమ్మవారిని అలంకరిస్తారు. 7న సుందరీ దేవి, 8న శ్రీ మహాలక్ష్మీదేవిగా, 9న శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని అలంకరిస్తారు. అక్టోబర్ 10న అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా, 11న శ్రీ మహిషాసుర మర్దని దేవిగా, చివరి రోజు అక్టోబర్ 12న శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అలంకరించనున్నారు.