Navratri day 1: సనాతన ధర్మంలో మూడు దైవారాధనలు అత్యంత ప్రాముఖ్యమైనవి. అవి, 1. శివారాధన 2. విష్ణు ఆరాధన, 3. శక్తి ఆరాధన. శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి, లక్ష్మీ, దుర్గాదేవి ఆరాధన. ఈ శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులకు మించినటువంటి విశిష్టమైన కాలం మరొకటి లేదు. శరన్నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో మొదటిరోజు అనగా ఆశ్వయుజ పాడ్యమి రోజు శ్రీ దుర్గాదేవిగా పూజిస్తారు.
విజయవాడ కనకదుర్గమ్మ అలంకరాల ప్రకారం నవరాత్రులలో మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవి అవతారం అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకరశర్మ తెలిపారు. దేవీ నవరాత్రులలో పాడ్యమి రోజు అయినటువంటి మొదటి రోజున అమ్మవారిని స్వర్ణ (బంగారపు) రంగు గల వస్త్రములతో అలంకరించాలి. అమ్మవారికి చలిమిడి, వడపప్పు పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు అమ్మవారిని శైలపుత్రిగా కూడా పిలుస్తారు.
హిమవంతుని కుమార్తె అగుట వలన అమ్మవారికి శైలపుత్రి అని పేరు వచ్చినది. దేవీ నవరాత్రులో మొదటి రోజు పూజ విశేషమైనటువంటి పూజ. ఈ రోజు కలశారాధన చేయడం, కలశస్థాపన చేయడం విశేషం. అమ్మవారిని "శ్రీమాత్రే నమ:" అనే మంత్రంతో 108 సార్లు జపించి కర్పూరహారతితో పూజించాలి.
దేవీ భాగవతం ప్రకారం పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులు వధించటానికి బ్రహ్మదేవుని కోరికపై విష్ణువుని మహా మాయ నిద్రలేపడం జరిగింది. అయితే యోగనిద్ర నుండి నిద్రలేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేసినా, వారిని జయించలేకపోవడం జరిగింది. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరం కావాలి అని ప్రశ్నించారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తధ్యమని గ్రహించి తమను నీరు లేనిచోట చంపమని కోరుతారు. అంతటితో శ్రీమహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాలలో సంహరించే సమయంలో.. మహా మాయ పదితలలతో, పది కాళ్ళతో, నల్లని రూపుతో మహాకాళి ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడెను. ఈ విధముగా మహా మాయ అయినటువంటి అమ్మవారితో మహావిష్ణువు రాక్షస సంహారం చేసెను. కంస సంహారమునకు సహాయపడుటకై నందా అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడెను. సింహవాహినిగా మహిసాసురుడుని, సరస్వతీ రూపిణిగా సుంబ, నుసుంబులను అలాగే ఛండ ముండులను సంహరించిన ఛాముండిగా, లోకాలను కరువునుంచి రక్షించినందుకు శాఖాంబరిగా, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా పురాణాలు చెబుతున్నాయి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
మొబైల్: 9494981000.
సంబంధిత కథనం