Vijayawada : 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం.. సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్-minister nara lokesh participated in the cii meeting held in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada : 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం.. సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్

Vijayawada : 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం.. సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్

Basani Shiva Kumar HT Telugu
Sep 21, 2024 03:43 PM IST

Vijayawada : 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యం అని.. మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన సీఐఐ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

సీఐఐ సమావేశంలో నారా లోకేష్
సీఐఐ సమావేశంలో నారా లోకేష్

పెట్టుబడుదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు.. కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విజయవాడలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.

గత ఐదేళ్లలో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు, రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో ఈ సదస్సులో చర్చించినట్టు లోకేష్ వివరించారు. ఇందుకోసం కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. పెట్టుబడుదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా ప్రభుత్వంతోనే చర్చించవచ్చని స్పష్టం చేశారు. కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటుపై వారం రోజుల్లో జీవో ఇస్తామని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒప్పందాలను వేరే ప్రభుత్వం మార్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.

వైసీపీ నిర్ణయాల చెడ్డపేరు..

'గత ప్రభుత్వంలో తీసుకున్న పీపీఏల రద్దు నిర్ణయం వల్ల కేవలం రాష్ట్రమే కాకుండా దేశం కూడా నష్టపోయింది. రాబోయే రోజుల్లో అది జరగకూడదు. రెన్యువబుల్ ఎనర్జీలో గతంలో ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశానికే చెడ్డపేరు వచ్చింది. అది జరగకూడదని కన్సల్టేటివ్ ఫోరమ్ ఏర్పాటు చేస్తాం. మేం లీడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసికట్టుగా చర్చించి.. అవసరమైతే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది' అని లోకేష్ అభిప్రాయపడ్డారు.

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..

'రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. దానికి కావాల్సిన రాయితీలు ఇవ్వడంతో పాటు, మౌలిక సౌకర్యాలు, ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. సదస్సులో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు కూడా సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు' అని లోకేష్ వివరించారు.

'గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారికి రావాల్సిన రాయితీలు, వారితో పెట్టుబడులు పెట్టించేందుకు ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డులో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చాం. గతంలో టీడీపీ హయాంలో ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు ఉండేది. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండేది. గత ప్రభుత్వం ఈడీబీని మూసేసింది. మూసేసిన ఈడీబీని పునరుద్ధరించాం. ఈడీబీలో పనిచేసినవారందరూ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. వారందరూ ఈడీబీలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్‌ను కూడా ఈడీబీ సీఈవోగా నియమించడం జరిగింది' అని లోకేష్ వ్యాఖ్యానించారు.

నూతన ఆలోచనలతో..

'రాష్ట్రాభివృద్ధిలో సీఐఐ కీలకపాత్ర పోషించాలి. విశాఖను ఐటీ హబ్ గా రూపొందించడంతో పాటు డేటా సెంటర్, ఏఐ యూనివర్సిటీని నెలకొల్పుతాం. ఆయా జిల్లాల్లో ఉన్న వనరుల ఆధారంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాం. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండా. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గల విస్తృత అవకాశాలను భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులకు వివరించాం. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తాం' అని లోకేష్ వివరించారు.