EDP : బీసీ, ఈబీసీ, కాపు యువతకు గుడ్ న్యూస్- పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక
Entrepreneur Development Program : బీసీ, ఈబీసీ, కాపు యువతకు ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇచ్చి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. హైదరాబాద్ లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
Entrepreneur Development Program : యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఈడీపీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. బీసీ, ఈబీసీ, కాపు యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమం అమలుపై ఆ సంస్థతో వివిధ శాఖల అధికారులు చర్చిస్తున్నారు. పారిశ్రామిక సిలబస్ తో 4 నుంచి 6 వారాల పాటు యువతకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఐదేళ్లలో 9 వేల మందికి శిక్షణ
ప్రతి ఏటా 2000 మందికి నైపుణ్య శిక్షణ అందించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏటా 1000 మంది బీసీలు, 500 మంది ఈబీసీలు, 500 మంది కాపు సామాజిక వర్గ యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. బీసీ, ఈబీసీ, కాపు వర్గాల నుంచి బ్యాచ్ 30 చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏడాది పొడవునా కొనసాగించనున్నారు. నైపుణ్య శిక్షణకు యువత ఎంపికపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. రానున్న ఐదేళ్లలో 9 వేల మందికి శిక్షణ ఇచ్చి వారిని పారిశ్రామివేత్తలుగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. శిక్షణ అనంతరం పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందించనుంది.
ఏపీలో నైపుణ్య గణన సర్వే
ఏపీ ప్రభుత్వం నైపుణ్య గణన సర్వేకు సిద్ధమైంది. ఈ మేరకు ఐటీ మంత్రి నారా లోకేశ్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. స్కిల్ సెన్సస్ పై ఇటీవల సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేశ్... ఈ సర్వేలో యువత ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, నైపుణ్యాలు తెలుసుకుని ఒక ప్రత్యేక రెజ్యూమ్ తయారు చేస్తామన్నారు. ఈ ప్రొఫెల్స్ ఆయా కంపెనీలు నేరుగా యాక్సెస్ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్హతలు, నైపుణ్య వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామన్నారు.
స్కిల్ సెన్సస్ సర్వే లక్ష్యం యువతకు ఉద్యోగాల కల్పన మాత్రమే అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ ఉద్దేశంతోనే నైపుణ్య గణన జరగాలన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల పెద్దలు, జాబ్ పోర్టల్స్ నిర్వాహకులతో చర్చించి మెరుగైన నైపుణ్య గణనకు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నైపుణ్య గణన సర్వే అనంతరం స్కిల్ డెవలప్మెంట్‌కు చర్యలు చేపడతామన్నారు.
యువత తమకు ఉద్యోగాలు లేవని, కంపెనీలు నైపుణ్యత ఉన్న యువత దొరకడం లేదని చెబుతున్న సమస్యలకు ఈ సర్వే పరిష్కారం కావాలన్నారు. కంపెనీలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడం, యువతకు ఉద్యోగాల కల్పించడం నైపుణ్య గణన అంతిమ లక్ష్యం అని లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సస్ సర్వే చేపట్టాలని సూచించారు. స్కిల్ సెన్సస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లోని అంశాలను అధికారులు మంత్రి లోకేశ్ కు వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్