Endowment Appintments: ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో అక్రమాలు, అనర్హులకు అడ్డదారిలో అందలం, అడ్డగోలు నియామకాలు...-irregularities in indrakiladri temple appointments appointments in loopline ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Endowment Appintments: ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో అక్రమాలు, అనర్హులకు అడ్డదారిలో అందలం, అడ్డగోలు నియామకాలు...

Endowment Appintments: ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో అక్రమాలు, అనర్హులకు అడ్డదారిలో అందలం, అడ్డగోలు నియామకాలు...

HT Telugu Desk HT Telugu
Aug 29, 2024 09:05 AM IST

Endowment Appintments: ఓ వైపు ముఖ్యమంత్రి దేవాదాయ శాఖను గాడిన పెట్టాలని, అన్యమత ప్రచారాన్ని కట్టడి చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే బెజవాడ దుర్గగుడిలో అందుకు భిన్నమైన తీరులో సాగుతోంది. అడ్డదారిలో ఉద్యోగాలను క్రమబద్దీకరించి ఉన్నత పదవుల్ని కట్టబెట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై అడ్డదారిలో నియామకాలు
బెజవాడ ఇంద్రకీలాద్రిపై అడ్డదారిలో నియామకాలు

Endowment Appintments: బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఓ తాత్కలిక ఉద్యోగి తన పోస్టును క్రమబద్దీకరించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అందర్నీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను క్రమబద్దీకరించడంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉండగా అవేమీ లేకుండా ఉన్నతాధికారులు, న్యాయమూర్తులతో ఉన్న పరిచయాలతో దొడ్డిదారిలో పని పూర్తి చేయించే ప్రయత్నాలపై హిందూ ధార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా జరగాల్సిన స్థాయి ఉద్యోగాన్ని మౌఖిక ఆదేశాలతో ఓ కాంట్రాక్టు ఉద్యోగికి శాశ్వతంగా కట్టబెట్టే ప్రయత్నాలపై హిందూ సంఘాలు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై అధికారుల పనితీరుకు అద్దం పట్టే ఘటన ఇటీవల వెలుగు చూసింది. దుర్గగుడిలో పనిచేసే ఎన్‌ఎంఆర్‌ ఒకరు ఆలయంలో అనధికారికంగా పీఆర్వోగా పనిచేస్తున్నారు. దాదాపు ఇరవై క్రితం దుర్గగుడిపై అధ్మాత్మిక మాస పత్రికను ప్రారంభించారు. వేదపండితులు, అధ్యాత్మిక గురువులతో కథనాలను రాయించి ఓ మాస పత్రికను ప్రారంభించాలని దేవస్థానం పాలకమండలి, అప్పటి ఈవో ప్రారంభించారు. అప్పట్లో ఇంద్రకీలాద్రిపై ఆ పని చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో కాంట్రాక్టు పద్ధతిలో ఓ ఉద్యోగిని నియమించుకున్నారు. ఆలయంలో పనిచేసే పలువురు ఉద్యోగులు ఇందులో పనిచేసేవారు. ఉద్యోగంలో చేరే సమయానికి సదరు ఉద్యోగికి ఎలాంటి విద్యార్హతలు లేవు. ఆ తర్వాత కాలంలో దూర విద్యలో కావాల్సిన విద్యార్హతలను సంపాదించుకున్నాడు.

ఇంద్రకీలాద్రిపై పనిచేస్తుండగా ఆలయానికి వచ్చే ఉన్నతాధికారులు, న్యాయమూర్తులతో పరిచయాలు పెంచుకుని బ్యూరోక్రసీలో పట్టు సంపాదించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతి కాలంలో సదరు ఉద్యోగిపై పలు సందర్భాల్లో ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు.

ఆలయానికి సమీపంలో అన్యమత ప్రచారం చేయడంతో పాటు, వ్యక్తిగత వివాదాలు, మహిళల నుంచి వేధింపుల ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. కొన్నాళ్లు ఉద్యోగం నుంచి దూరంగా ఉన్నా మళ్లీ పాత పరిచయాలతో పోస్టింగు దక్కించుకోగలిగినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో తన ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసుకోడానికి దుర్గగుడి అధికారులకు దరఖాస్తు చేయడంతో పాటు, ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. ఉద్యోగాల క్రమబద్దీకరణ విషయంలో రకరకాల నిబంధనల్ని పాటించడంతో క్యాబినెట్ స్థాయిలో అమోదించాల్సి ఉంటుంది. ఇవేమి లేకుండా నేరు అదనపు ఈవో క్యాడర్‌లో ఉద్యోగంలో నియమించేలా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో ఉత్తర్వులు ఇప్పించేలా వ్యవహారం నడిచింది.

సాధారణంగా ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటే అనుసరించాల్సిన విధివిధానాలు ఏమి లేకుండానే దుర్గగుడి ఈవో, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంపై హిందూ సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దుర్గగుడిలో ఉద్యోగంలో చేరేనాటికి సరైన అనుభవం, విద్యార్హతలు లేని వ్యక్తిని ఎలా శాశ్వత ఉద్యోగంలో నియమిస్తాయని ప్రశ్నిస్తున్నాయి.

ఏమి జరిగిందంటే...

ఉద్యోగి నియామకం విషయంలో దేవాదాయ శాఖ అధికారుల్ని తీవ్ర ఒత్తిళ్లకు గురి చేసినట్టు తెలుస్తోంది. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలాంటి తీర్పు వెలువడకుండానే మౌఖిక ఆదేశాలతో పనిపూర్తి చేసేలా అధికార యంత్రాంగంపై రకరకాల ఒత్తిళ్లను ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌‌పై సానుకూలంగా ఎలాంటి తీర్పు రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయ శాఖ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయాలంటూ ఆలయ ఈవోపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఉద్యోగాన్ని క్రమబద్దీకరించేలా ఉత్తర్వులు జారీ చేయడం వెనుక న్యాయశాఖ అధికారులు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది.

గత మే నెలలో ఇంద్రకీలాద్రిపై హుండీ లెక్కింపు జరుగుతున్న సమయంలో  దేవాదాయ శాఖ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయడం లేదని, న్యాయవాదులు, పోలీసు అధికారులతో తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడంతో నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ఈవోతో ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరించ కుండానే, కేవలం మధ్యలో ఉన్న వ్యక్తుల నోటిమాట ఆధారంగా అధికారులు పని పూర్తి చేశారు. రూ.48,440- 1,37,220 పే స్కేల్‌తో ఉద్యోగాన్ని ఖరారు చేస్తున్నట్టు ప్రొసిడింగ్స్‌ విడుదలయ్యాయి.

ఎన్నికల ఫలితాల కోసం అంతా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడం వెనుక ఉన్నత స్థాయి అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తోంది.ఈ వ్యవహారంలో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉండటంతో దేవస్థానం ఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను క్రమబద్దీకరించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖలో ఏఈఓ స్థాయి ఉద్యోగ నియామకంలో జరిగిన వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలని డిమాండ్ వినిపిస్తోంది.

బెజవాడ ఇంద్రకీలాద్రి కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇటీవల పిటిషన్ విచారణ సందర్భంగా జరిగిన తంతు చూసిన హైకోర్టున్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒరిజినల్ పిటిషన్‌ విచారణకు వచ్చిన సమయంలో అసలు విషయాలు బయటకొస్తాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది.

రాష్ట్ర స్థాయి ఆలయమైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై శాశ్వత ఉద్యోగులు లేకపోవడంతో పీఆర్వో వంటి కీలక బాధ్యతల్లో అనర్హులు తిష్టవేస్తున్నారు. ఉన్నత స్థాయి పరిచయాలు దక్కే పోస్టు కావడంతో దానిని దక్కించుకోడానికి పైరవీలు చేయడం అక్కడ పనిచేసే ఉద్యోగులకు పరిపాటిగా మారింది.