Ex DGP Son In Law Scam: ట్రాఫిక్ చలాన్ల సొమ్ము కొట్టేసిన మాజీ డీజీపీ అల్లుడిపై ఈడీ కేసు నమోదు
Ex DGP Son In Law Scam: ట్రాఫిక్ చలాన్ల రూపంలో ప్రజల నుంచి సేకరించిన డబ్బుల్ని దారి మళ్లించిన మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. రూ.36.53 కోట్లను మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు ఐదేళ్లుగా స్వాహా చేయడం గత నెలలో తిరుపతిలో బయటపడింది.
Ex DGP Son In Law Scam: ఏపీలో సంచలనం సృష్టించిన ట్రాఫిక్ ఈ-చలాన్ల కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. పోలీస్ శాఖ నిధుల్ని దారి మళ్లించిన వ్యవహారంపై దర్యాప్తు చేపట్టనుంది. ట్రాఫిక్ చలాన్ల సొమ్మును దారి మళ్లించి డబ్బులు కాజేసిన నిధుల్ని ఎలా దారి మళ్లించారనే దానిపై ఆరా తీస్తున్నారు. పోలీసు ఖాతాలకు చేరాల్సిన డబ్బులతో ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ప్రధాన నిందితుడికి సంబంధించిన ఆస్తుల్ని ఇతరుల పేరట మార్చకుండా ఆంక్షలు విధించారుర. రూ.36కోట్ల రుపాయల అక్రమంగా బదిలీ చేసిన వ్యవహారంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం ) కింద ఈడీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్‌కు చెందిన డేటా ఎవాల్వ్ సంస్థకు ఐదేళ్ల క్రితం ట్రాఫిక్ చలాన్ల నిర్వహణ కాంట్రాక్టును కేటాయించారు. అతనితో పాటు మరికొందరు కుట్రపూరితంగా నిధులను దారి మళ్లించినట్టు గుర్తించారు. ఐదేళ్లుగా సాగుతున్న వ్యవహారం తిరుపతిలో వెలుగు చూసింది.
ఆన్‌లైన్‌లో చలాన్ల సొమ్ము చెల్లించినా మళ్లీ బకాయిలు చూపుతుండటంతో కొందరు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు డేటా ఎవాల్వ్ సంస్థ పేమెంట్ గేట్‌వేలను మార్చి నిధులు దారి మళ్లించినట్టు గుర్తించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారు చెల్లించిన చలానాల సొమ్ము రూ.36.53 కోట్లను నండూరి సాంబశివరావు రెండో అల్లుడు అవినాష్ మరికొందరితో కలిసి కొల్లగొట్టారని గుర్తించారు. ఈ వ్యవహారంపై ఏపీ పోలీసులు గత వారం కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా తాజాగా ఈడీ మరో కేసు నమోదు చేసింది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారుఆన్‌లైన్‌లో జరిమానాలు చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఆన్‌లైన్‌లో జరిమానా సొమ్ములను పేమెంట్ గేట్‌వేల ద్వారా పోలీసు శాఖ ఖాతాలకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ చలాన్ సాఫ్ట్‌వేర్ రూపొందించిన డేటా ఎవాల్వ్ సంస్థ పేమెంట్ గేట్‌వేలను మార్చేసింది. సాంబశివరావు డీజీపీగా ఉన్నప్పుడు ఆయన అల్లుడు అవినాష్‌కు చెందిన డేటా ఎవాల్వ్ సంస్థకు ఈ కాంట్రాక్టు వచ్చింది. ఎలాంటి రుసుము లేకుండా పోలీసులకు సేవలు అందిస్తామని కాంట్రాక్టు దక్కించుకున్నారు.
ఆన్‌లైన్ పేమెంట్లకు రేజర్ పే యాప్ ద్వారా డబ్బులు పోలీసు ఖాతాలకు బదిలీ అయ్యేలా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఆన్‌లైన్ గేట్‌వే ద్వారా జరుగుతున్న భారీ లావాదేవీలపై కన్నేసిన అవినాష్‌తో మరికొందరు నిర్వాహకులు 'రేజర్‌పే' యాప్‌ను క్లోనింగ్ చేసి 'రేజర్ పీఈ' పేరుతో మరో యాప్ గేట్‌వేను రూపొందించారు.
ప్రజలు చెల్లించే పెనాల్టీ సొమ్ములు పోలీసుల ఖాతాలోకి కాకుండా, తమ ఖాతాలలోకి మళ్లించుకున్నారు. చలానాలు చెల్లించిన వెంటనే రసీదు వస్తుండటంతో ప్రజలకు కూడా అనుమానం రాలేదు. ఐదేళ్లుగా జనం జరిమానా చెల్లించినా అది పోలీసు ఖాతాలో జమ కాలేదు. తిరుపతిలో ఒకరు జరిమానా చెల్లించినా ఆన్‌లైన్ మళ్లీ బకాయిలు కనిపించడంతో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. నిధులు ఎక్కడికి మళ్లించారనే దానిపై ఈడీ దర్యాప్తు చేయనుంది.