Tirumala : వరుస సెలవు దినాలు... తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Tirumala Tirupati Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
Tirumala Tirupati Devasthanam Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవు దినాలు కావటంతో భక్తుల రాక మరింత పెరిగింది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లున్నీ భక్తులతో నిండిపోయాయి. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటలలోపు పూర్తి అవుతుంది.
శుక్రవారం తిరుమల శ్రీవారిని 71,664 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైంస్లాట్ టిక్కెట్లు లేని భక్తులకు శ్రీవారి దర్శన సమయం ఎక్కువగా పడుతుందని పేర్కొన్నారు.
శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుస సెలవు దినాలు కావటంతో తిరుమలలో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు.
గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు..
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
ఫిబ్రవరి 17న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 18న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 19న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 20న ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 21, 22, 23వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు – 7 చుట్లు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారన టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.