Free Tabs in AP : మీ వాళ్ల చేతుల్లో ట్యాబ్స్‌ ఉండొచ్చు.. పేద పిల్లల చేతుల్లో ఉండొద్దా..? ఎందుకీ కడుపు మంట - సీఎం జగన్‌-cm ys jagan distributing free tabs to 8th class students at chinthapalli in alluri sitharama raju district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Free Tabs In Ap : మీ వాళ్ల చేతుల్లో ట్యాబ్స్‌ ఉండొచ్చు.. పేద పిల్లల చేతుల్లో ఉండొద్దా..? ఎందుకీ కడుపు మంట - సీఎం జగన్‌

Free Tabs in AP : మీ వాళ్ల చేతుల్లో ట్యాబ్స్‌ ఉండొచ్చు.. పేద పిల్లల చేతుల్లో ఉండొద్దా..? ఎందుకీ కడుపు మంట - సీఎం జగన్‌

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 21, 2023 02:40 PM IST

CM YS Jagan Distributing Free Tabs : భవిష్యత్తు ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా ఉంచేందుకు ఐబీ సిలబస్‌ను రాబోయే రోజుల్లో తీసుకువస్తున్నామని చెప్పారు సీఎం జగన్. ఉచిత ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ప్రైవేటు స్కూళ్లన్నీకూడా ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు.

విద్యార్థులతు ముఖ్యమంత్రి జగన్
విద్యార్థులతు ముఖ్యమంత్రి జగన్

CM YS Jagan Distributing Free Tabs : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ట్యాబ్స్‌ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... నాకు కొండంత అండగా నిలబడే అడవితల్లి బిడ్డ మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తన పుట్టినరోజున ఈకార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పిల్లలే మన వెలుగులు, వీరే మన భవిష్యత్తు అని అన్నారు. ప్రపంచంతో పోటీపడే పరిస్థితులు ఉండాలి, అందులో మన పిల్లలు గెలవాలని ఆకాంక్షించారు. దీన్నే కోరుకుంటూ ఈ 55 నెలల్లో మన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందని తెలిపారు.

"వరుసగా రెండో ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం.10 రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమం జరుగుతుంది. అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం ఒకటి. 4.35 లక్షల మంది పిల్లలకు ట్యాబులను పంపిణీచేస్తున్నాం. డిజిటల్‌ విప్లవంలో భాగంగా గతేడాది కూడా నా పుట్టినరోజునే 686 కోట్లతో 5.18లక్షల ట్యాబులను విద్యార్థులకు, చదువులు చెప్తున్న టీచర్లకు పంపిణీచేశాం. ట్యాబుల్లో బైజౌస్‌ కంటెంట్‌ను పెట్టాం. ఆఫ్‌ లైన్లోకూడా పనిచేసేలా పెట్టాం. ప్రతి పిల్లాడికీ పాఠాలన్నీ సులభంగా, పూర్తిగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలు వీడియో రూపంలో పెట్టాం. ట్యాబుల్లో ఏదైనా సమస్యవస్తే మీ హెడ్‌ మాస్టర్‌కు ఇచ్చినా, గ్రామ సచివాలయాల్లో ఇచ్చినా వారంరోజుల్లో రిపేరు చేసి ఇవ్వడం జరుగుతుంది. రిపేరు చేయలేకపోతే ఇంకో ట్యాబు పిల్లల చేతుల్లో పెట్టడం జరుగుతుంది.ఎండీఎం సాఫ్ట్‌వేర్‌తో ట్యాబులను నియంత్రించడం జరుగుతుంది. పిల్లలు పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏంచేస్తున్నారన్నదానిపై తల్లిదండ్రులకు, టీచర్లకు తెలుస్తుంది. ట్యాబుల వినియోగం వల్ల ఎలాంటి ఆందోళనలు, భయాలు అవసరం లేదు. పిల్లలకు మంచి బోధన అందించే ఉపకరణాలు ఇవి. పిల్లల చేతుల్లో పెట్టే ఈ ట్యాబు మార్కెట్‌ విలువ రూ.17,500. దీంతోపాటు శ్రీమంతుల పిల్లలు మాత్రమే కొనుక్కునే రూ.16వేల విలువైన బైజూస్‌ కంటెంట్‌ను ఉచితంగా ట్యాబుల్లోకి డౌన్లోడ్‌ చేసి అందిస్తున్నాం. కంటెంట్‌తో విలువతో కలుపుకుని అక్షరాల రూ.33వేలు అవుతుంది. ఇంత ఖర్చుచేసి పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతున్నాం" అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్.

రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్…

మరోవైపు ప్రతి స్కూళ్లో కూడా 6వ తరగతిపైబడ్డ తరగతిగదుల్లో డిజిటలైజేషన్‌ చేశామని గుర్తు చేశారు సీఎం జగన్. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానెల్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1 నుంచి 5వ తరగతి గదుల్లో కూడా ఇంగ్లీషు ల్యాబ్స్‌ పెట్టి స్మార్ట్‌ టీవీలు 10,035 పెట్టాం. దీనికోసం మొదటి దశలో రూ. 427 కోట్లు ఖర్చు చేశాం. రెండో దశ నాడు – నేడు పనులు పూర్తి చేసుకున్న మిగిలిన స్కూళ్లలో కూడా తరగతిగదులు డిజిటలైజేషన్‌ చేస్తాం. మరో 31 వేలకుపైగా క్లాసు రూమ్స్‌లో ఐఎఫ్‌పీలు పెడతాం. ఐఎఫ్‌పీలు బిగించడమే కాకుండా, వీటిలో ఎస్‌డీ కార్డులు, ఆండ్రాయిడ్‌ బాక్సులు పెడుతున్నాం. బైజూస్‌ కంటెంట్‌కూడా అప్‌లోడ్‌ చేశాం. దీంతో ఈ కంటెంట్‌ను క్లాస్‌రూమ్స్‌లో నేర్చుకోవచ్చు, ట్యాబుల్లో కూడా అవే పాఠాలు ఉంటాయి. పిల్లలకు కన్ఫ్యూజన్‌ అనేది ఉండదు. ఇంతలా పిల్లల గురించి వాళ్ల మేనమామ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌నుకూడా తీసుకువస్తున్నాం. రాబోయే కాలంలో పిల్లలు మరింత అభివృద్ధి చెందేలా, విదేశీ భాషలను నేర్చుకునేలా ఒక యాప్‌ను కూడా డౌన్లోడ్‌ చేశాం. ఈ ట్యాబ్‌ నిరంతరం ట్యూటర్‌గా పిల్లలకు తోడుగా ఉంటుంది. మన రాష్ట్రంపిల్లలు ప్రపంచంలో బెస్ట్‌గా ఉండాలి. టోఫెల్‌ నిర్వహణా సంస్థ ఈటీఎస్‌తో ఒప్పందం చేసుకున్నాం. ఒక పీరియడ్‌లో కూడా టోఫెల్‌పై శిక్షణ ఇస్తున్నాం. ఇవ్వాళ్టి పరిస్థితులు మరో 15-20 సంవత్సరాల తర్వాత మారిపోతాయి. 8వ తరగతి నుంచి ఫ్యూచర్‌ స్కిల్స్‌ను నేర్పిస్తున్నాం. పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా మంచి సంకల్పంతో ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్టును తీసుకువస్తున్నాం. సంబంధిత ట్యూటర్ల నియామకంకూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తు ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా ఉంచేందుకు ఐబీ సిలబస్‌ను రాబోయే రోజుల్లో తీసుకువస్తున్నాం" అని చెప్పారు ముఖ్యమంత్రి జగన్.

మన పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండొద్దా…

జగన్‌ దుబారాగా డబ్బులు ఖర్చుచేస్తున్నారని గిట్టని వారు అంటున్నారని కామెంట్స్ చేశారు సీఎం జగన్ . "మేం చేసే ప్రతి పైసాకూడా మానవవనరుల అభివృద్దికోసం పెడుతున్నాం. రేపటి భవిష్యత్తుమీద ప్రతి పైసాకూడా పెడుతున్నాం. పిల్లలు అందరికీ కూడా ఇవ్వగలిగే ఆస్తి చదువులు మాత్రమే. అప్పుడే పేదల తలరాతలు మారుతాయి. మార్పులు తీసుకువస్తున్న మన ప్రభుత్వంమీద బురదజల్లుతున్నారు. పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని ఆరాటపడుతున్నాం. మంచేస్తున్న ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారు. పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదని కొందరు చెప్తున్నారు. ట్యాబులు చేతిలో ఉంటే.. పిల్లలు చెడిపోతున్నారని రాస్తున్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ పేద వర్గాలకు చెందిన పిల్లలుమీద తప్పుడు రాతలు రాస్తున్నారు. ప్రతిరోజూ పనిగట్టుకుని నాపై విమర్శలు చేస్తున్నారు. జగన్‌ బర్త్‌డే బహుమతి.. చెడగొడుతోంది మతి అని ఈనాడులో రాశారు. ఇది పేపరా.. పేరుకు పట్టిన పీడా. ఇలాంటి పేపర్‌ను చదవొచ్చా..? ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని చెప్తున్నా. ఇంతగా దిగజారి మాటలు మాట్లాడకండి అని చెప్తున్నా. పేదవర్గాల పిల్లలమీద ఇంతకా విషం కక్కండి అని చెప్తున్నా. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే.. ఇంత కడుపుమంట వద్దని చెప్తున్నా. మీ పిల్లలు, మనవళ్ల చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, లేప్‌ట్యాపులు ఉండొచ్చు, స్మార్ట్‌ ఫోన్లు ఉండొచ్చు. కాని పేదల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, ల్యాపుట్యాపులు ఉండకూడదు, స్మార్ట్‌ ఫోన్లు ఉండకూడదు. మీ పిల్లల చేతులలో ఇవన్నీ ఉంటే చెడిపోరు, కాని పేదల పిల్లల్లో మాత్రం ఉంటే చెడిపోతారు. మీ పిల్లలు, మనవళ్లేమో ఇంగ్లిషు మీడియంలోనే చదవాలి, కాని పేద పిల్లలు ఇంగ్లిషులో మాత్రం చదవకూడదు. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదివితే తెలుగుభాష అంతరించిపోతుంది అంట? కాని వాళ్ల పిల్లలు, వాళ్ల మనవళ్లు మాత్రం ఇంగ్లిషులోనే చదవాలి. ఇది ధర్మమేనా? ఇది సరైన పోకడేనా. ఇలాంటి రాజకీయాలతో మీ బిడ్డ యుద్ధంచేస్తున్నాడు" అని అన్నారు ముఖ్యమంత్రి జగన్.

మోసపోవద్దని కోరుతున్నాను - సీఎం జగన్

"ఒకవైపు జగన్‌ఫొటోకు పది తలకాయలు పెట్టి రాష్ట్రం అంతా అప్పులు పాలై పోయిందంటారు: మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి.. ఆరు గ్యారంటీలు అనిచెప్తున్నాడు. దాని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా పెడుతున్నాడు. వాళ్లు ఇస్తానన్నవి, ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజురియింబర్స్‌మెంట్‌, రైతులకు ఉచిత విద్యుత్‌, ఆరోగ్య శ్రీ అన్నీ కలిపితే.. జగన్‌ ఇచ్చేవాటికన్నా, వాళ్లు చెప్తున్నవి మూడింతలు ఎక్కువ. ఎంత మోసానికైనా వాళ్లు వెనకడుగు వేయరు. 2014-19 వరకూ వాళ్లే పరిపాలన చేశారు. 87,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానన్నారు, వాళ్లనూ మోసంచేశారు. డ్వాక్రా రుణాలు మాఫీచేస్తానన్నారు, వాళ్లనీ మోసం చేశారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు, జాబు ఇవ్వకపోతే రూ.2వేల నిరుద్యోగభృతి అన్నారు. ఎవ్వరికీ ఇచ్చిన పాపాన పోలేదు. ఎవ్వరినీ వదలకుండా మోసం చేశారు. ప్రజలంతా ఆలోచన చేయాలి. నేను బటన్‌ నొక్కాను, 2.44లక్షలకోట్లు నేరుగా కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఎవరైతే మీకు మంచిచేశారో.. వారిని గుర్తుపెట్టుకోండి. మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మళ్లీ మోసం చేసేందుకు వీళ్లంతా బయల్దేరారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, ఒక బెంజికారు ఇస్తానంటున్నారు. మోసపోవద్దని ప్రజలను కోరుతున్నాను" అని చెప్పారు సీఎం జగన్.

Whats_app_banner