CM Jagan : చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు విడుదల-cm jagan released jagananna thoudu scheme funds ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan : చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు విడుదల

CM Jagan : చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు విడుదల

HT Telugu Desk HT Telugu
Aug 03, 2022 12:15 PM IST

చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ అని సీఎం జగన్ అన్నారు. చిరు వ్యాపారుల కష్టాలు తన పాదయాత్రలో చూశానని చెప్పారు. అందుకే వారికి అండగా ఉంటున్నాని తెలిపారు.

<p>సీఎం జగన్</p>
సీఎం జగన్

జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేశారు. వివిధ రకాల చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున.. ఆరు నెలల్లో అందించిన రూ.395 కోట్ల వడ్డీలేని రుణాలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీ మొత్తాన్ని సీఎం జగన్‌ లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు.

ఆరు నెలల్లో ఇచ్చిన రూ.395 కోట్లతో కలిపి పథకం ప్రారంభించినప్పటి నుంచి.. ఇప్పటి వరకు 15,03,558 మంది లబ్ధిదారులకు రూ.2,011 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించింది. బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకోసారి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. రుణం తీర్చిన లబ్ధిదారులు మళ్లీ వడ్డీలేని రుణం పొందేందుకు అర్హులు. వడ్డీలేని రుణాన్ని బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు.

'అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ భారం లేకుండా లక్షల కుటుంబాలను ఆదుకున్నాం. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి వడ్డీకి లేని రుణాలు ఇస్తున్నాం. ఏటా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తున్నాం. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటుగా గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను జమ చేస్తున్నాం. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాం. లబ్ధిదారులు.. తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మిగతా వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు.' అని సీఎం జగన్ అన్నారు.

Whats_app_banner