CM Jagan : జనవరి 1 నుంచి మందులు ఉచితంగా డోర్ డెలివరీ, ఆరోగ్య సురక్ష-2పై సీఎం జగన్ ఆదేశాలు
CM Jagan Review on Aarogyasri : వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ దేశంలోనే చారిత్రక కార్యక్రమంగా నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
CM Jagan Review on Aarogyasri : వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం కార్యక్రమంపై సీఎం జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ మండల కార్యాలయాల నుంచి అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. ఇతర ప్రజాప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. ఆరోగ్య శ్రీ కార్యక్రమం దేశ చరిత్రలోనే చారిత్రక ఘటనగా నిలిచిపోతుందని సీఎం జగన్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా ఆరోగ్య శ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తున్నామన్నారు. వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికీ ఉండదని ఉద్దేశంతో ఆరోగ్య శ్రీ పరిమితి పెంచామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నామన్నారు. దీనిపై ప్రతి ఇంట్లోనూ అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఆరోగ్య శ్రీని వినియోగించుకోవడానికి కార్డులు జారీ చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు.
1.4 కోట్ల కుటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
"సంవత్సరానికి రూ.5 లక్షల ఆదాయం వస్తోన్న కుటుంబాలను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. 1.4 కోట్ల కుటుంబాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చాం. 1059 ప్రొసీజర్లకు మాత్రమే గతంలో ఆరోగ్య శ్రీ వర్తించేది. వెయ్యి దాటి ఖర్చయ్యే ప్రొసీజర్లన్నింటినీ ఆరోగ్య శ్రీ కిందకు తీసుకువచ్చాం. పేదవాళ్లు అప్పులు పాలు కాకూడదనే ఉద్దేశంతో ప్రొసీజర్లను విస్తరించాం. ప్రస్తుతం 3257 వైద్య సేవలకు ఆరోగ్య శ్రీని వర్తింపుజేస్తున్నాం. గతంలో కేవలం 748 ఆస్పత్రులకు పరిమితమైతే ఇప్పుడు 2513 ఆస్పత్రులకు (ఇతర రాష్ట్రాల్లో కలిపి) ఆరోగ్య శ్రీని విస్తరించాం. హైదరాబాద్‌లో 85, బెంగుళూరులో 35, చెన్నైలో 16 ఆస్పత్రుల్లో 716 ప్రొసీజర్లకు ఆరోగ్య శ్రీని వర్తింపుచేశాం. చికిత్సల సంఖ్యను పెంచడం, ఆరోగ్య శ్రీ సేవలను ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం వరకూ ఉన్నవారికి వర్తింపు చేయడం, అలాగే రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీని వర్తింపు చేయడం వంటి కీలక మార్పులు చేశాం" - సీఎం జగన్
ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా కోసం రూ.4100 కోట్లు ఖర్చు
వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏడాదికి రూ.4100 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. 108,104 సేవలతో కలిసి ఏడాదికి కేవలం రూ.4,400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. చికిత్స తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకునేవారికి నెలకు రూ.5 వేల చొప్పున ఆరోగ్య ఆసరా ఇస్తున్నామన్నారు. ఆరోగ్య ఆసరా కింద 25,27,870 మందికి రూ.1,310 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద ఈ ప్రభుత్వంలో 53,02,816 మంది చికిత్స పొందినట్లు వివరాలు తెలిపారు. పూర్తిస్థాయిలో క్యాన్సర్ చికిత్స, రెండు చెవులకూ కాక్లియర్ ఇంపాక్ట్ ఆపరేషన్లు, బోన్ మ్యారో, స్టెట్‌సెల్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా చికిత్సను ఆరోగ్య శ్రీ అందిస్తున్నామన్నారు. పెద్ద ఖర్చుతో కూడిన ప్రొసీజర్లను ఉచితంగా చికిత్సలు అందించామన్నారు. క్యాన్సర్ లాంటి వ్యాధులకు ఎలాంటి పరిమితులు లేకుండా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ.1,897 కోట్లు ఖర్చు చేశామన్నారు.
ఆరోగ్య శ్రీ కార్డుల్లో కొత్త ఫీచర్లు
రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చామని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఎక్కడకు వెళ్లినా సిబ్బంది ఉండరనే పరస్థితులను మార్చివేశామన్నారు. ఎప్పుడూ చూడని విధంగా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించామన్నారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం అయితే, ఏపీలో ఈ కొరత కేవలం 3.96 శాతం మాత్రమే ఉందన్నారు. గతంలో ప్రభుత్వాసుపత్రుల్లో మందులు లేని పరిస్థితి కనిపించేదని, అలాంటి పరిస్థితులను మారుస్తూ ప్రభుత్వం పంపిణీ చేసే ప్రతి మందు కూడా డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు మాత్రమే ఉండేట్టుగా చూస్తున్నామన్నారు. 562 రకాల మందులు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రివెంటివ్ కేర్‌ను విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రివెంటివ్ కేర్‌లో భాంగా 10032 విలేజ్ క్లినిక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. ఆరోగ్యశ్రీకార్డుల్లో కొత్త ఫీచర్లు తీసుకువచ్చామని, క్యూఆర్ కోడ్ లో పేషెంట్లకు సంబంధించిన అన్ని వివరాలు నిక్షిప్తం చేసి ఉంటాయన్నారు. దీనివల్ల వైద్యులు సులభంగా వైద్యం అందించడానికి వీలవుతుందన్నారు.
ఆరోగ్య సురక్ష-2
"ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా రోగులకు సంబంధించి డేటా బేస్ తీసుకువచ్చి, వారికి సరిగ్గా చేయూత నిస్తున్నారా? లేదా? అని చూడాలి. డాక్టర్ రిఫరెల్, అంతేకాక వారికి కావాల్సిన మందులు అందుతున్నాయా? లేవా? అన్న దానిపై సమీక్ష చేయాలి. జనవరి 1 నుంచి మందులు ఉచితంగా డోర్‌డెలివరీ ద్వారా అందుతాయి. ఆరోగ్య సిబ్బంది ఇండెంట్ పంపితే సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు పోస్టుల్ సర్వీసు ద్వారా విలేజ్ క్లినిక్‌కు అందుతాయి. అక్కడ నుంచి ఆరోగ్య సిబ్బంది రోగలకు మందులను అందిస్తారు. రిఫరెల్ కేసులకు సంబంధించి ప్రయాణ ఖర్చుల కింద రూ.300లను ప్రభుత్వమే అందిస్తుంది. ఇవన్నీ జగనన్న ఆరోగ్య సురక్ష-2లో భాగంగా చేపడతారు. జనవరి 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది"- సీఎం జగన్