Ysrcp Leaders : సీఎం జగన్ మాటే మాకు వేదం, గంగలో దూకమన్నా దూకుతాం-సీట్ల మార్పుపై స్పందిస్తున్న వైసీపీ నేతలు
Ysrcp Leaders : నియోజకవర్గాల మార్పు, టికెట్ల కేటాయింపులపై వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. టికెట్లు ఇవ్వకపోయినా సీఎం జగన్ వెంటే ఉంటామంటున్నారు. జగన్ గంగలో దూకమంటే దూకుతామంటున్నారు.
Ysrcp Leaders : వైసీపీ నేతల్లో టికెట్ టెన్షన్ మొదలైంది. పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు క్యూకట్టారు. నియోజకవర్గాల మార్పుచేర్పులపై వైసీపీ నేతలు,మంత్రులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. విజయవాడ పశ్చిమ సీటుకు వేరొకరికి కేటాయిస్తారన్న ప్రచారం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన సీటు మారుస్తారన్న ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పారు. సీటు మార్పు గురించి అధిష్టానం ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి రెండ్రోజుల క్రితం సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లామనమన్నారు. విజయవాడ వెస్ట్ నుంచి మళ్లీ పోటీ చేస్తానని వెల్లంపల్లి అన్నారు. తనను విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేమన్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అలాగే తాను పార్టీకి రాజీనామా చేశానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ఏం చెబితే అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
గంగలో దూకమంటే దూకుతా-మేరుగు నాగార్జున
సీఎం జగన్ మాటే మాకు వేదం, ఆయన గంగలో దూకమంటే దూకుతామని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంతనూతలపాడు ప్రజలను గెలిపించమని అర్ధిస్తామన్నారు. ఇంఛార్జ్‌ల మార్పుచేర్పులు పార్టీ మంచి కోసమే చేస్తున్నారన్నారు. మేం ఇన్ ఛార్జ్ లను మార్చుకుంటే మీకేంటమని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. మేరుగు నాగార్జున వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజాగా వైసీపీ అధిష్టానం ఆయనను సంతనూతలపాడుకు ఇన్ ఛార్జ్ గా నియమించింది.
వసంత కృష్ణ ప్రసాద్ సీటు డౌటే?
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వరనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల వసంత కృష్ణ ప్రసాద్ సీఎంను కలిశారు. ఇవాళ మరోసారి తాడేపల్లికి రావాలని వసంత కృష్ణ ప్రసాద్ కు కాల్ వచ్చినా ఆయన వెళ్లలేదని తెలుస్తోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో పార్టీ పెద్దలను కలవాలని వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎంవో ఆదేశాలు జారీచేసింది. అయితే తాను వేరే పని ఉన్నందున ఈరోజు రాలేనని ఆయన చెప్పినట్లు సమచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఎమ్మెల్యే తన అనుచరులతో అన్నట్లు తెలుస్తోంది. అందుకే సీఎంవో నుంచి కాల్ వచ్చినా వెళ్లలేదని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. వసంత కృష్ణ ప్రసాద్ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. మైలవరం సీటు కోసం జోగి రమేష్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య పంచాయితీ నడిచాయి.