Anantapur Rains : అనంతపురం వర్షాలు.. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం 2 వేలు
CM Jagna Reviw : అనంతపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. అక్కడ పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతపురం(Anantapur)లో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. నిర్వాసితులకులైన వారికి అధికారులు అండగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని చెప్పారు. సహాయక చర్యలపై సీఎం జగన్(CM Jagan) అధికారులతో మాట్లాడారు.
'బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలి. బియ్యం, పామాయిల్, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు.. ఈ ఐదు రకాల నిత్యావసర వస్తులను ప్రతి బాధిత కుటుంబానికి చేరవేయాలి. వర్షాలు(Rains), వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంటనష్టంపై అంచనాలు తయారు చేయాలి. నిర్ణీత సమయంలోగా వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి.'అని సీఎం జగన్ ఆదేశించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం నగరంలో 50 ఏళ్లలో ఇలాంటి వర్షాలు కురవలేదని స్థానికులు అంటున్నారు. గడిచిన 24 గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షం అనంతపురంలో పడింది. పీఏబీఆర్, ఎంపీ ఆర్ చాగల్లు పేరూరు బైరవణ తిప్ప ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 15 వేల క్యూసెక్కుల నీరు పెన్నా నదిలోకి విడుదల అవుతోంది. నగరంలోని నడిమి వంకకు వస్తున్న వరదలతో సుమారు 15 కాలనీలు నీట మునిగాయి.
చాలామంది మిద్దెపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. ముంపు బాధితులను పలవురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 15కు పైగా పునరావస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.
మరోవైపు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కొన్ని చోట్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదోనిలోనూ వర్షానికి ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనతో ఇంట్లోని ఒకరు మృతి చెందారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. వరద నీరు పొలాల్లోకి చేరి తీవ్రం నష్టం వాటిల్లింది. పొలాలు నీటిలో మనిగిపోయాయి. చేతికి వచ్చిన పంట నీట మునగడంతో రైతులు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.