Rains Telugu States: మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు-weather updates of telugu states over rain alert by imd ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rains Telugu States: మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

Rains Telugu States: మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

HT Telugu Desk HT Telugu

rain alert to telugu states: రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Rains in AP and Telangana: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండో రోజులు ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది,

పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలుపడే అవకాశం ఉందని చెప్పింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 15వ తేదీ ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మంగళవారం ఆదిలాబాద్‌, కొమరం భీం, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.

ఇక హైదరాబాద్ లో ఆకాశం సాధారణంగా మోఘవృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. బుధవారం ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు (గాలి వేగం గంటకు 04 - 08 కి.మీ) వీచే అవకాశం ఉంది అని ఓప్రకటనలో వివరించింది.

ఏపీలోనూ వర్షాలు…

rains in andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో కురిసింది. ఇవాళ, రేపు కూడా వర్షాలు కురిసే అకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలో పలు కాలనీలు జలదిగ్భంధలోనే ఉన్నాయి. రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

మరోవైపు.. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. రెండు గేట్లను 10 అడుగుల మేర తెరచి 55,874 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. బ్యాక్‌వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 3 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 338 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి 10 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 80,690 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.