Rain Alert : ఏపీలో విస్తారంగా వర్షాలు….-rain alert to andhra pradesh and telangana for next five days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rain Alert : ఏపీలో విస్తారంగా వర్షాలు….

Rain Alert : ఏపీలో విస్తారంగా వర్షాలు….

HT Telugu Desk HT Telugu
Oct 10, 2022 11:19 AM IST

Rain Alert దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. సోమవారం తమిళనాడు సమీపానికి రానుందని వాతావరణ శాఖ అంచనావేసింది. దీని ప్రభావంతోపాటు సముద్రం నుంచి వీస్తున్న తేమగాలులతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఏపీలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు (unplash)

Rain Alert బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అనేకచోట్ల మోస్తరుగా, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. రానున్న 48 గంటల్లో రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత రెండు రోజులు కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విజయవాడలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

బంగాళాఖాతం (Bay of bengal) తో పాటు భూ ఉపరితలంపై ఆవర్తనాలు కొనసాగడంతో రుతుపవనాలు బలంగా మారాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ నెల ప్రారంభం నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాం తాల్లో ముసురు వాతావరణం నెలకొనడంతోపాటు చెరువులు, కుంటలు నిండాయని, భూగర్భజల మ ట్టాలు పెరిగాయి. వారం రోజుల వర్షాలకు కొన్నిచోట్ల మెట్ట పంటలు దెబ్బతిన్నాయన్నారు. రుతుపవనాలు తిరోగమన సమయంలో వారం రోజులపాటు వర్షాలు కురవడం వాతావరణ మార్పులను సూచిస్తోంది. మరో వారం రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రానికి మరో ఐదు రోజులకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ Rain Alert ఇచ్చింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.మరో వైపు రాష్ట్రంలో వారం రోజలుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పంటలు దెబ్బతింటాయన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. ఉదయం పొడి వాతావరణం ఉంటున్నా సాయంత్రానికి ఒక్కసారిగా భారీ వర్షం పడుతుంది. వారం రోజులుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

అటు తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, హనుమకొండలో తేలికపాటి మోస్తరు వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో మోస్తరు వాన పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వర్షంతో జనం అవస్థలు పడ్డారు. హుజురాబాద్, శంకరపట్నం మండలాల్లో ఉరుములతో మోస్తరు వర్షం పడింది. కుమ్రం భీం జిల్లా కౌటాల మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో జనం ఇళ్లలో నుంచి బయటికి రాలేకపోయారు. కాగజ్ నగర్ మండలంలో మోస్తరు వర్షం కురిసింది.

మరోవైపు ఈ నెల 14 వరకు రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రేపు, ఎల్లుండి చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో.. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్