Nikhat Zareen | ఆర్థిక సహాయం ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు: నిఖత్ తండ్రి
భారత బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఆర్థిక సహాయం ప్రకటించడంపై ఆమె కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిఖత్ తండ్రి జమీల్ అహ్మద్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
భారత బాక్సర్ నిఖత్ జరీన్‌కు సర్వత్రా ప్రశంసల వర్షం వెల్లువెత్తుతోంది. తెలంగాణ నిజామాబాద్‌కు చెందిన ఈ బాక్సర్ ఇటీవల జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని నెగ్గిన విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన ఆమెకు ఘన స్వాగతం పలికింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఆమె కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు భూమిని కూడా అందజేసింది. దీంతో నిఖత్ కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.
నిఖత్ తండ్రి జమీల్ అహ్మద్.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. "మన తెలంగాణ సీఎం కేసీఆర్ సర్ రెండు కోట్ల నగదు బహుమతి, నివాసానికి ఓ ప్లాట్ ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ సర్‌కు నా ధన్యవాదాలు." అని జమీల్ అహ్మద్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతితో పాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్‌లో నిఖత్‌కు ప్రభుత్వం నివాస స్థలాన్ని కేటాయించింది. 2014లో నిఖత్‌కురూ.50 వేలు కేటాయించిందని జమీల్ గుర్తు చేసుకున్నారు. "2014లో నిఖత్‌కు రూ.50 వేలు ఇవ్వడం ఓ మలుపు. ఇప్పుడు మాకు 2 కోట్ల నగదు ఇవ్వడం మరో మలుపు. ఈ సహాయం మాకు గతంలో కంటే ఎక్కువ సంతోషాన్ని కలగజేసింది." అని అన్నారు.
టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పతకం గెలిచిన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. మొత్తం మీద ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో పసిడి గెలిచిన అయిదో భారత బాక్సర్‌గా నిలిచింది నిఖత్.
సంబంధిత కథనం
టాపిక్