Housing For Poor In Amaravati: సామాజిక అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామన్న సిఎం జగన్
Housing For Poor In Amaravati: పెత్తందారుల రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని సామాజిక అమరావతిగా మారుస్తూ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో 1400ఎకరాల్లో 50వేల ఇళ్ల నిర్మాణానికి సిఎం జగన్ శంకు స్థాపన చేశారు.
Housing For Poor In Amaravati: అమరావతిలో పేదలకు ఇళ్ల నిర్మాణం రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుందని సిఎం జగన్ చెప్పారు. పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత, ఎన్నో అవరోధాలను అధిగమించి సాధించిన విజయంతో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఇళ్ళు కట్టించి ఇవ్వకుండా చంద్రబాబు, మీడియా సంస్థలు, దత్తపుత్రుడు అడ్డుపడ్డారని సిఎం జగన్ ఆరోపించారు.
చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు పేదలకు ఇల్లు రాకూడదు, ఇంటి స్థలం రాకూడదని అడ్డుకునే ప్రయత్నం చేశారని సిఎం ఆరోపించారు. నేటికి కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దన్నారని, ఇళ్లు కట్టొద్దని అడ్డుకున్నారని, అందుకు హైకోర్టు, సుప్రీం కోర్టుల వరకు వెళ్లారని వివరించారు. ఇలాంటి దౌర్భగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉంటుందన్నారు. చంద్రబాబు, గజదొంగలకు ముఠా పేదలకు ఇళ్లు ఇవ్వకూడదు, రాకూడదని పెద్ద మనుషులు, పెత్తందారులు, ఎన్నో కేసులు వేశారన్నారు.
హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు….
పేదలకు ఇళ్లు, ఇంటి స్థలం రాకూడదని హైకోర్టులో 18కేసులు, సుప్రీం కోర్టులో ఐదు కేసులు వేశారని వివరించారు. మూడేళ్లుగా కోర్టుల్లో వేసిన కేసులు పరిష్కరించేందుకు పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. చివరకు దేవుడి ఆశీస్సులు, ప్రజల చల్లని ఆశీస్సులతో హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం గెలిచి ఇళ్ల పట్టాలు ఇచ్చిందన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోవడంతో, ఆ తర్వాత ఇళ్లు నిర్మించకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేశారని, కేంద్రంలో ఎక్కని గడప, దిగని గడప లేదన్నారు. కేంద్ర మంత్రలు, సెక్రటరీలను కలిశారని, చివరకు హైకోర్టులో కేసులు వేశారన్నారు.
పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ఇంత మంది పెత్తందారులు ముమ్మర ప్రయత్నాలు చేసిన దాఖలాలు గతంలో ఎప్పుడు లేవన్నారు. వీటన్నింటిని అధిగమించి అడుగులు ముందుకు వేసినట్లు చెప్పారు.ఇంటి నిర్మాణానికి ఇక్కడే పునాదులు వేస్తున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం చేసిన సామాజిక న్యాయపోరాటం చరిత్ర ఉన్నంత వరకు మర్చిపోలేని ఘటనగా నిలిచిపోతుందన్నారు. పెత్తందారుల మీద పేదల విజయంగా నిలిచిపోతుందన్నారు.
పేదలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి, చంద్రబాబు నేతృత్వంలోని పెత్తందారుల కూటమికి మధ్య యుద్ధమే జరుగుతోందన్నారు. రాక్షస బుద్దితో ఉన్న వారికి ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతుందన్నారు. నయా జమిందారులు పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు రాకూడదని అడ్డు పడ్డారన్నారు. వారి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిస్తారని, పేద పిల్లలు తెలుగు చదవకపోతే తెలుగు భాష ఏమై పోతుందని గగ్గోలు పెడతారన్నారు.
పేదల కోసం ఎలాంటి లంచాలు తావివ్వకుండా, అక్షరాలా 2.25లక్షల కోట్ల రుపాయలు నేరుగా ఖాతాల్లోకి పంపిస్తుంటే అడ్డుపడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ ఇప్పుడు అప్పుడు ఉందని, అప్పటి కంటే అప్పుల భారం ఇప్పుడు తగ్గిందని చెప్పారు.
పేదలపై అక్కసు ఎందుకు…?
రాష్ట్రంలో 30లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే రకరకాల కోర్టు కేసులు వేసి వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారని సిఎం ఆరోపించారు. పేదలకు ఒకటో తేదీన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లంచాల ప్రమేయం లేకుండా పెన్షన్ పంపిణీ చేసే ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రాజధానిగా చెప్పుకునే అమరావతిలో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యం వస్తుందని కోర్టులకు వెళ్లారని ఆరోపించారు. పేదల వ్యతిరేకులు, పెత్తందారులతో యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు. దుర్మార్గమైన మనుషులు, మనస్తత్వాలు, టీవీ చర్చలు, రాజకీయ పార్టీలతో ఇప్పుడు పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడు చూడలేదన్నారు. ఏ సమాజం అయినా, కుటుంబం అయినా నేటి కంటే మెరుగైన భవిష్యత్తును కోరుకుంటుందని, అలాంటి కోరికను అడ్డుకునే వారిని ఏమనాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
అమరావతిలో ఉండటానికి అమెరికా, సింగపూర్ నుంచి మనుషులు రావొచ్చని, చుట్టుపక్కల ఉండే పేదలకు ఇళ్ల స్థలాలు మాత్రం ఇవ్వకూడదనే భావనను గతంలో ఎక్కడా చూడ లేమన్నారు. నేటితో సామాజిక అమరావతిగా పునాది రాయి వేస్తూ, పెత్తందారుల అమరావతి ఇక అందరి అమరావతిగా చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తుంది….
50,793మంది మహిళలకు వారి పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చామని, పేదలందరికి ఆప్షన్ 3 ప్రకారం ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణం చేపట్టే బాధ్యత సంతోషంగా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల్లో 1400ఎకరాల్లో 25లే ఔట్లలో 50,793 మందికి ఇళ్ల స్థలాలు ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఒక్కో ఇంటిని రూ.2.70లక్షల వ్యయంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. 50,793 ఇళ్లకు రూ.1370కోట్లను ఖర్చు చేయనున్నట్లు వివరించారు. నీటి సరఫరా కోసం రూ.32కోట్లు, విద్యుత్ కనెక్షన్ల కోసం రూ.326కోట్లతో, అప్రోచ్ రోడ్లకు రూ.8కోట్లతో పనులు చేపడుతున్నారు. సిఆర్‌డిఏ లేఔట్లలో అంగన్ వాడీ కేంద్రాలు, స్కూళ్లు, పార్కులు, మెడికల్ కేంద్రాలు ఏర్పాటవుతాయన్నారు.