Chandrababu: బోగీ మంటల్లో జీవో నెంబర్ 1 కాపీలు.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్-chandrababu burnt the copies of the go number 1 copies during bogi celebrations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu: బోగీ మంటల్లో జీవో నెంబర్ 1 కాపీలు.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

Chandrababu: బోగీ మంటల్లో జీవో నెంబర్ 1 కాపీలు.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

HT Telugu Desk HT Telugu
Jan 14, 2023 09:56 AM IST

Chandrababu burnt the copies of Go number 01: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్వగ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 1 కాపీలను భోగి మంటల్లో వేసిన చంద్రబాబు.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

జీవో నెంబర్ 1 కాపీలను దహనం చేస్తున్న చంద్రబాబు
జీవో నెంబర్ 1 కాపీలను దహనం చేస్తున్న చంద్రబాబు

Chandrababu burnt the copies of the Go number 01: ప్రభుత్వం తెచ్చిన జీఓ నెంబర్ 1 ను భోగి మంటల్లో వేసి టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన తెలిపారు. నారావారిపల్లిలో ఏర్పాటు చేసిన బోగీ వేడుకల్లో పాల్గొన్న ఆయన... రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను భోగిమంటల్లో వేసి దహనం చేశామన్నారు. సైకో పాలన పోవాలని ఈ సందర్భంగా కోరుకున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాన్ని సాధించి పెట్టింది పొట్టి శ్రీరాములు అయితే....వారికి గౌరవం తెచ్చిపెట్టింది ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు.

"ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజావేదికతో విధ్వంసం ప్రారంభం అయ్యింది. సైకో పాలనతో అన్ని వర్గాలు నష్టపోయాయి. దేశంలో ఎక్కువ పెట్రో ధరలు, ఎక్కువ కరెంట్ చార్జీలు, ఎక్కువ నిత్యావసర వస్తువులు, ఎక్కువ ఇంటి పన్ను, చెత్త పన్ను ఉన్న రాష్ట్రం మన రాష్ట్రమే. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ధనికులే కాదు...పేద వాళ్లు కూడా పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో సంక్షేమానికి నాంది పలికింది నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం. రెండు రూపాయలకే కేజీ బియ్యం, జనతా వస్తాలు వంటి పథకాలు తెచ్చింది టిడిపినే. నాడు జన్మభూమి కార్యక్రమం సందర్భంగా నా సతీమణి భువనేశ్వరి నారా వారిపల్లె వెళ్లే కార్యక్రమం తలపెట్టారు. 23 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది సొంత ఊరు వచ్చి మేము కూడా సొంత ఊళ్లో పండుగ చేసుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే విధంగా మారిపోయింది. అవేదనతో, భాధతో పెద్ద ఎత్తున మహిళలు యువత ఇదేం ఖర్మ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. ప్రశ్నించిన నాపైనా కేసులు పెడుతోంది. నన్ను అడ్డుకుంటోంది. నా సభలకు బందోబస్తు కూడా ఇవ్వడం లేదు. కందుకూరు ప్రమాదానికి కారణం భద్రత ఇవ్వకుండా ప్రభుత్వం చేసిన కుట్ర. నాటి సభకు ఎందుకు పోలీసులను భద్రతగా పంపలేదు..? ఇది కుట్ర కాదా? గుంటూరు సభలో జరిగిన తొక్కిసలాట కూడా కుట్రలో భాగమే" అని చంద్రబాబు ఆరోపించారు.

ఇవన్నీ చూపించి...జీవో నెంబర్ 1 తీసుకువచ్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. తాము ప్రజలను కలవకూడదని ఆంక్షలు పెట్టారని విమర్శించారు. "నాకు జగన్ పై ఎటువంటి ద్వేషం లేదు. జగన్ తండ్రి వైఎస్ ఆర్ నాకు మంచి స్నేహితుడు. నేను, వైఎస్ఆర్ 1978లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లాం. నాకు వైఎస్ తో మంచి అనుబంధం ఉండేది. నేడు రాష్ట్రంలో అన్ని వర్గాలు ఈ పాలనతో నష్టపోయారు. ఇసుక ఎందుకు దొరకడం లేదు.? దీని వల్ల నిర్మాణ రంగంపై ఎంత ప్రభావం పడింది.? ఆయా వృత్తుల వారు ఎంత నష్టపోయారనేది ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. బిసి, ఎస్సి, ఎస్టీలకు పథకాలన్నీ రద్దు చేశారు. దీంతో ఆ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. జగన్ పాలనతో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది. చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా సంస్థ ఎందుకు వెళ్లిపోయింది.? చిత్తూరు ప్రజల రుణం తీర్చుకోవడానికి పెట్టిన అమర్ రాజా ఫ్యాక్టరీని పంపేశారు. ఫ్యాక్టరీలో పొల్యూషన్ అనే ఆరోపణలతో సంస్థను తెలంగాణకు పంపారు. జగన్ రెడ్డి, అతని సైకోల కారణంగా ప్రజలు ఆస్తులు కోల్పోతున్నారు. ప్రజల మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు" అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

"పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై 40 రోజుల్లో 10 కేసులు పెట్టారు. కార్యకర్తలను పండగపూట జైల్లో పెట్టారు. దీనికి పెద్దిరెడ్డి తప్పక అనుభవిస్తాడు. గుర్తు పెట్టుకో పెద్దిరెడ్డి... దుర్మార్గాలు చేస్తున్న ప్రతి ఒక్కరి లెక్కలు రాసి పెడుతున్నా....ఈ సంక్రాంతి సందర్భంగా చెపుతున్నా.....ఇంతకు ఇంతా చేద్దాం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సైకో పాలన పోవడం ఖాయం. మద్యంతర ఎన్నికలు వస్తే ముందే ఈ ప్రభుత్వం పోతుంది. పోలీసులకు కూడా జరుగుతున్న తప్పు తెలుసు కానీ....కొందరు పోలీసులు తప్పులు చేస్తూనే ఉన్నారు" అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Whats_app_banner