Chandrababu Kuppam Tour: పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో... నీ తడాఖా ఏంటో తేలుస్తా
Chandrababu Fires On YCP Govt: వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడిన చంద్రబాబు… పిరికితనంతో తప్పుడు కేసులు పెట్టి తన పర్యటనలను అడ్డుకోవాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Chandrababu Kuppam Tour Updates: చట్టవిరుద్ధంగా తమ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని... తమ వాహనాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌లో భయం పుట్టుకొచ్చిందని... ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలు బాధపడుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఆనందపడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ అరాచకశక్తిగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లినందుకు నిరసనగా ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ఎం.ఎం. కల్యాణ మండపం వరకు చంద్రబాబు పాదయాత్రగా వెళ్లారు.
తమపై పోలీసులు అక్రమ కేసులు పెడితే.. తాము కూడా పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు చంద్రబాబు. పోలీసులు ఆలోచించాలి.. 5 కోట్ల మందికి సహకరిస్తారా.. శాడిస్ట్ సీఎం పక్కన ఉంటారా అని ప్రశ్నించారు అని నిలదీశారు. జగన్‌కు ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. కుప్పంలో ప్రభుత్వం రౌడీల రాజ్యం తేవాలని చూస్తోందని అన్నారు. జగన్ ఖబడ్దార్ గుర్తుపెట్టుకో.. ఇసుక మైనింగ్‌లో రూ.50 కోట్ల కప్పం కట్టాలా? అని ప్రశ్నించారు. గౌరవ సభ అసెంబ్లీని కౌరవ సభగా మార్చారని.... తిరిగి గౌరవ సభగా మారినప్పుడే అసెంబ్లీలో అడుగుపెడతానని మరోసారి పునరుద్ఘటించారు.
వైసీపీ సర్కార్ వచ్చిన ఈ మూడున్నరేళ్లలో బిహార్ కంటే ఏపీ వెనక్కి వెళ్లిపోయిందన్నారు చంద్రబాబు. ఏపీలో ఎవరికీ రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, షర్మిల, జగన్ పాదయాత్రలు చేశారని గుర్తు చేశారు. ఆ పాదయాత్రలకు పోలీసు భద్రత కల్పించానని... ఇప్పుడు వీళ్లు మాత్రం తన నియోజకవర్గంలో తాను తిరుగుతుంటే అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు. జిల్లా ఎస్పీ లా అండ్ ఆర్డర్‌ను కాపాడేందుకు వచ్చారా? తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు వచ్చారా అని నిలదీశారు.
ఇక జిల్లా మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. పెద్దిరెడ్డీ గుర్తు పెట్టుకో.. తమాషా ఆటలాడుతున్నావు.. నీ తడాఖా ఏంటో చూస్తా అని సవాల్ విసిరారు. "తమపై తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నావు. అధికారంలో ఉన్న 14 ఏళ్లు నేనూ అలాగే అనుకునుంటే నువ్వు జిల్లాలో తిరిగేవాడివా?" అని ప్రశ్నించారు. కుప్పంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తామంటే ఊరుకునేదిలేదన్నారు.