Minister Roja: కందుకూరు, గుంటూరు ఘటనలకు చంద్రబాబే బాధ్యుడు : మంత్రి రోజా
Minister Roja: కందుకూరు, గుంటూరు ఘటనలకు చంద్రబాబే బాధ్యుడని.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ ఘటనలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
Minister Roja: కందుకూరు, గుంటూరు ఘటనలకు చంద్రబాబే బాధ్యుడని.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. గుంటూరులో టీడీపీ కానుకుల పంపణీ కార్యక్రమంలో ముగ్గురు నిరుపేద మహిళలు మృతి చెందడం.. మరికొందరు గాయాలపాలవడం.. చాలా ఘోరమైన పరిణామంగా చూడాలని వ్యాఖ్యానించారు. ఏవేవో కానుకలంటూ ఊదరగొట్టే ప్రచారంతో మహిళల్ని తీసుకెళ్లి... అక్కడ వారికి ఎటువంటి కానుకలు ఇవ్వలేదని... సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తోపులాట జరిగి .. ముగ్గురు మహిళలు మృతి చెందారని విమర్శించారు. ఈ ఘటనతో పాటు కందుకూరు ఘోరంపై కూడా సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యల కోసం సీఎం జగన్ ని తామంతా కోరతామని పేర్కొన్నారు.
పోలీసుల వైఫల్యం వల్లే గుంటూరు దుర్ఘటన జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించిన రోజా.. వాస్తవానికి పోలీసులు పటిష్ట చర్యల కారణంగానే ప్రమాద తీవ్రత తగ్గిందని అన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని... అక్కడ సరిపడా సిబ్బంది లేకపోయి ఉంటే.. ఇంకా ఎంత ఘోరమైన పరిస్థితి జరిగి ఉండేదో అని వ్యాఖ్యానించారు. తన సభలకు జనాలు రావడం లేదనే... చంద్రబాబు కానుకలు, చీరలు ఇస్తామని చెప్పి మహిళలను సభలకు తరలించే పరిస్థితికి దిగజారారని ఆరోపించారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లపట్టాలను పంపిణీ చేస్తే.. ఎక్కడా చిన్న అవాంతరం జరగలేదని.. వైఎస్‌ఆర్‌సీపీ క్రమశిక్షణ అలా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు తనపార్టీ కార్యకర్తల్ని కంట్రోలు చేయలేని నాయకుడని... టీడీపీలో ఎక్కడా క్రమశిక్షణ కనిపించదని విమర్శించారు.
చంద్రబాబు తానా అంటే తందానా అంటూ.. నడిరోడ్ల మీద కార్లపై ఇష్టానుసారంగా ఊరేగుతూ, యువతను రెచ్చగొట్టే పవన్‌కళ్యాణ్ కేవలం ప్యాకేజీకే తప్ప పాలిటిక్స్‌కు పనికిరాడని రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనికిమాలిన విషయాలపై తీవ్రంగా స్పందిస్తూ.. ఇప్పటం గోడలపై రాద్ధాంతం చేసిన పవన్‌కళ్యాణ్.. ఇప్పుడు గుంటూరు, కందుకూరులో జరిగిన ఘోరమైన ఘటనల మీద ఎందుకు నోరు తెరవలేదని ప్రశ్నించారు. మాట్లాడితే ప్యాకేజీ ఇచ్చిన నాయకులకు నష్టం కలుగుతుందనేనా అని నిలదీశారు. ప్రజల ప్రాణాలంటే పవన్‌కు లెక్కలేదని.. జనసేనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కులం గురించి అరిచినా.. చెప్పులు చూపించినా.. పవన్ కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేడని.... ఆయనకు ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్పాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ రోజు ప్రతీ కుటుంబానికి జగనన్న నేతృత్వంలో రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు సంక్షేమ పథకాల ద్వారా అందుతుంటే.. లోకేష్ ఏ మొఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తారని రోజా ప్రశ్నించారు. బాబు పర్యటనలు, ప్రసంగాలంటే.. ఆ పార్టీ నాయకులే ‘ఇదేం ఖర్మరా బాబు’ అని తలబాదుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2024లో వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.